రైల్వే భద్రతపై లఘు చిత్రాలతో అవగాహన 

Telangana Police Officials Awareness On Railway Safety With Short Films - Sakshi

ప్రమాదాలు, జాగ్రత్తలపై అవగాహన పెంపే లక్ష్యం 

ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: రైల్వేభద్రతపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. రైలు ప్రమాదాల నియంత్రణ, ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లఘు చిత్రాల ద్వారా అవగాహన కల్పించాలని పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు. గురువారం ఇక్కడ డీజీపీ అంజనీకుమార్‌ అధ్యక్షతన స్టేట్‌ లెవల్‌ సెక్యూరిటీ కమిటీ ఫర్‌ రైల్వేస్‌ (ఎస్‌ఎల్‌ఎస్‌సీఆర్‌) సమావేశం నిర్వహించారు.

రైల్వే అడిషనల్‌ డీజీపీ బి.శశిధర్‌రెడ్డి, శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ సంజయ్‌కుమార్‌ జైన్, సికింద్రాబాద్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఐజీ రాజారామ్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవీ..  

►రైల్వే ట్రాక్‌లపై మరణాలు, రైళ్లలో మానవ అక్రమ రవాణా, రైళ్లలో చోరీల కట్టడి, కదులుతున్న రైళ్లపై రాళ్ల దాడుల నియంత్రణకు అవసరమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు  

►రైల్వే ట్రాక్‌ల సమీపంలో నివాసం ఉండే ప్రజలకు రైల్వే ట్రాక్‌లపై పాటించాల్సిన జాగ్రత్తలు, ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్లు, రైళ్లలో మొబైల్‌ చోరీలు వంటి అంశాల్లో జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా లఘు చిత్రాల నిర్మాణం 

►రైళ్లో మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేసేలా మత్తు పదార్థాల రవాణా ముఠాలపై చట్టపరమైన చర్యలు, రైలు టికెట్‌ బుకింగ్‌లో అక్రమాల కట్టడికి చర్యలు 

►రైల్వే ట్రాక్‌లు, ప్లాట్‌ఫాంలపై ప్రమాదాలతోపాటు మృతుల గణాంకాలు వెల్లడిస్తూ ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా హెచ్చరించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top