
మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఎల్‌ఓఐ కుదుర్చుకుంటున్న ఇయాన్ మార్టిన్, భవేశ్ మిశ్రా
మంత్రి శ్రీధర్‌బాబు
ఆస్ట్రేలియా ‘డికన్ యూనివర్సిటీ’తో భాగస్వామ్యం
మంత్రి సమక్షంలో ‘ఎల్‌ఓఐ’పై సంతకాలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా ఏఐ రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఏఐలో నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ఏఐ’సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ్రస్టేలియాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ‘డికన్’విశ్వవిద్యాలయం’ముందుకొచి్చంది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ)పై సోమవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ‘డికన్ యూనివర్సిటీ’వీసీ ప్రొఫెసర్ ఇయాన్ మార్టీన్, రాష్ట్ర ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటయ్యే ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సమాజానికి ఉపయోగపడే అత్యాధునిక ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేస్తుందన్నారు. దీంతో పాటు పరిశోధనలు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ రంగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులను తెలంగాణ నుంచే అందించా లని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కలిసి ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏఐ కోర్సులకు రూపకల్పన చేస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గవర్నెన్స్ తదితర రంగాల్లో ఏఐ వినియోగాన్ని పెంచి పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.
‘టీ చిప్’ చరిత్రాత్మక ముందడుగు
భారత్ సెమీకండక్టర్ విప్లవానికి తెలంగాణను వేదికగా నిలబెట్టే దిశగా టీ–చిప్ (టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం)పై రూపొందించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సంస్థ చైర్మన్, ఎండీ సందీప్ కుమార్ మక్తాల సోమవారం మంత్రి శ్రీధర్‌బాబుకు సమరి్పంచారు. తెలంగాణను సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో ఇది ఒక చరిత్రాత్మక ముందడుగు అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశంసించారు. టీ చిప్ బృందం ఇటీవల తైవాన్, హాంకాంగ్ పర్యటనలో సేకరించిన కీలక వివరాలతో ఈ డీపీఆర్‌ను సిద్ధంచేసినట్లు సందీప్ వెల్లడించారు.
అనేక ప్రపంచస్థాయి సంస్థలను సందర్శించి చిప్ డిజైన్, సెక్యూర్ ఆర్కిటెక్చర్స్, మాన్యుఫాక్చరింగ్ మోడల్స్, పారిశ్రామిక వినియోగాలపై విలువైన అవగాహన ఏర్పరుచుకున్నట్లు తెలిపారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ మంది సెమీకండక్టర్ నిపుణుల కొరత ఏర్పడుతుందని దానిని దృష్టిలో పెట్టుకుని 85 వేల మంది నిపుణులు, వేయి మంది ప్రొఫెసర్లు, 10వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈవీ బ్యాటరీలు, ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లేలు, ఏఐ రెడీ సర్వర్లు, అధునాతన రోబోటిక్స్ రంగాల్లో సెమీకండక్టర్ అప్లికేషన్లు వాడాలని ఆయన సూచించారు. డీపీఆర్‌లోని వివరాలను సందీప్ మక్తాలా మంత్రి శ్రీధర్‌బాబుకు వివరించారు.