ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రులు
హైదరాబాద్ : ప్రపంచానికే తలమానికంగా ఉండేలా “ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, డి .శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం నాడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రతిష్టాత్మక “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ… గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టును ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు.
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ ప్రారంభోత్సవాన్నికి సంబంధించిన తేదీల పై గౌరవ ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఫ్యూచర్ సిటీలో తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం వేస్తున్న పునాదులు రాబోయే తరాలకు ఆధునిక తెలంగాణ నిర్మాణానికి నాంది పలుకుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.
ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన అనేక ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎదురైన అనేక సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణకే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోందని, ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రపంచంలోని అనేక దేశాలు, రాష్ట్రాలు సైతం ఆలోచించని విధంగా తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో కొనసాగుతున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పనుల పురోగతిని సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుని నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.
అనంతరం మంత్రులు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ కె. శశాంక, ఐఏఎస్, మహేశ్వరం డీసీపీకె. నారాయణ రెడ్డి, ఐపీఎస్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


