
ఢిల్లీ: ఇటీవల తెలంగాణలో సంభవించిన వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణమే నిధులు విడుదల చేయాలని కేంద్రానికి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణకు వరద సాయం కింద తక్షణమే రూ. 5,018 కోట్ల నిధులను విడుదల చేయాలని రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావులు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వినతి పత్రం సమర్పించారు. వరద నష్టాన్ని అంచనా వేయడానికి వెంటనే కేంద్ర బృందాలను తెలంగాణకు పంపాలన్నారు.
‘తెలంగాణలో వరదల వల్ల రూ. 5, 018 కోట్ల రూపాయల నష్టం జరిగిందనేది అంచనాగా ఉంది. ఈ నిధులను తక్షణమే విడుదల చేయండి. 2024కు సంబంధించి 11713 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. మొత్తం కలిపి 16,732 కోట్ల రూపాయలు విడుదల చేయండి. ఆగస్టు 25 28 తేదీలో తెలంగాణలో భారీ వర్షాల వల్ల మెదక్ నిజామాబాద్ నిర్మల్ ప్రాంతాలలో తీవ్ర నష్టం జరిగింది. కామారెడ్డిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది
వరదలలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు , అనేక పశువులు చనిపోయాయి. అనేక ఇల్లు వర్షాలతో దెబ్బతిన్నాయి. వరదలకు రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. దెబ్బతిన్న రోడ్లు విద్యుత్ స్తంభాలు పునరుద్ధరించేందుకు పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయాలి’ అని తెలంగాణ మంత్రులు విజ్ఞప్తి చేశారు.

నిర్మలా సీతారామన్‌తో భేటీ
తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కార్యక్రమానికి ప్రత్యేక ఆర్థిక సహాయం కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మల్లు, తుమ్మల నాగేశ్వరరావులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.