10% ఫీజు చెల్లిస్తే పాత రేట్లే | Telangana launches portal under Hyderabad Industrial Land Transformation Policy | Sakshi
Sakshi News home page

10% ఫీజు చెల్లిస్తే పాత రేట్లే

May 24 2026 1:12 AM | Updated on May 24 2026 1:12 AM

Telangana launches portal under Hyderabad Industrial Land Transformation Policy

హిల్ట్‌–పీ పాలసీపై నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం 

జూన్‌ 30లోగా దరఖాస్తు చేసుకున్న కంపెనీలకు వర్తింపు 

మల్టీ–యూజ్‌ జోన్‌ అనుమతి పొందితే ఏడాదిపాటు పాత స్థలంలో కొనసాగే వెసులుబాటు 

ప్రభుత్వ రాయితీలు, సబ్సిడీలు కొత్త చోటకూ బదిలీ 

నూతన పారిశ్రామిక పార్కులలో ప్లాట్ల కేటాయింపులో ప్రాధాన్యం

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపల దశాబ్దాల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక ప్రాంతాలను పర్యావరణహితంగా, నివాసయోగ్యంగా (మల్టీ–యూజ్‌ జోన్స్‌) మార్చేందుకు తీసుకొచి్చన హైదరాబాద్‌ ఇండ్రస్టియల్‌ ల్యాండ్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ (హిల్ట్‌–పీ)కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. జూన్‌ 30లోగా 10% అడ్వాన్స్‌ ఇంపాక్ట్‌ ఫీజు చెల్లించే దరఖాస్తుదారులకు పాత ఎస్‌ఆర్‌ఓ (సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌) రేట్లే వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు హిల్ట్‌–పీ మార్గదర్శకాలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జారీ చేశారు.

ఇందులో భాగంగా భూమార్పిడి రుసుముల వివరాలను ప్రకటించారు. జీవో 18 ప్రకారం పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. మొత్తం 21 పారిశ్రామిక పార్కులతోపాటు స్టాండ్‌ ఎలోన్‌ యూనిట్ల దరఖాస్తులను పరిశీలించడానికి రెండు వేర్వేరు టీమ్‌లను ఏర్పాటు చేశారు. హిల్ట్‌–పీ పోర్టల్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మే 28 నుంచి భూముల ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. 

నూతన పాలసీతో ప్రయోజనాలు.. 
ఎస్‌ఆర్‌ఓ రేట్ల రాయితీ: 2026 జూన్‌ 30లోగా 10% అడ్వాన్స్‌ ఇంపాక్ట్‌ ఫీజు చెల్లించే దరఖాస్తుదారులకు పాత ఎస్‌ఆర్‌ఓ రేట్లే వర్తిస్తాయి.  
 తరలింపునకు ప్రోత్సాహకాలు: ఓఆర్‌ఆర్‌ వెలుపలికి మారాలనుకునే పరిశ్రమలకు పాత ప్రదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రాయితీలు, సబ్సిడీలు కొత్త చోటుకూ బదిలీ అవుతాయి.  
చార్జీల సర్దుబాటు: విద్యుత్, నీటి కనెక్షన్ల కోసం గతంలో చెల్లించిన చట్టబద్ధమైన ఫీజులను కొత్త లొకేషన్‌లో సర్దుబాటు చేస్తారు. 
ప్లాట్ల కేటాయింపులో ప్రాధాన్యం: నగరం వెలుపల టీజీఐఐసీ నిర్మించే కొత్త పారిశ్రామిక పార్కుల్లో వారికి ప్లాట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇస్తారు. 
ఏడాది గడువు: మల్టీ–యూజ్‌ జోన్‌ అనుమతి పొందిన తర్వాత కూడా పరిశ్రమను ప్రస్తుత ప్రాంతంలో ఏడాదిపాటు నిర్వహించుకోవడానికి గడువు ఇస్తారు.

పారిశ్రామిక భూమి విస్తీర్ణం  -  ప్రాసెసింగ్‌ ఫీజు  (రూ. లలో) 
ఒక ఎకరం వరకు  -  20,000 
1 ఎకరంపైగా–5 ఎకరాల వరకు  -  50,000 
5 ఎకరాలకుపైగా–10 ఎకరాల వరకు  -  1,00,000 
10 ఎకరాలకుపైగా–25 ఎకరాల వరకు  -  2,00,000 
25 ఎకరాలకుపైగా–50 ఎకరాల వరకు  - 5,00,000 
50 ఎకరాలకు మించి  -  10,00,000 

సేల్‌ డీడ్‌ ఉంటేనే.. 
అర్హతలు: రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌ కలిగి ఉండి పూర్తయిన పారిశ్రామిక ప్లాట్లు మాత్రమే అర్హత ఉంటాయి. దరఖాస్తుకు ముందే పాత బకాయిలు (ఈఓటీ, మ్యుటేషన్, ప్రాపర్టీ ట్యాక్స్, సబ్‌–డివిజన్‌ చార్జీలు) క్లియర్‌ చేయాలి. 

తప్పనిసరి పత్రాలు: సేల్‌డీడ్, ఈసీ, తాజా ఆస్తిపన్ను రశీదు, స్థలం కలర్‌ ఫొటోలు, సంస్థ రిజిస్ట్రేషన్‌ (ఉద్యమ్‌ ఆధార్‌/ఆర్‌ఓసీ మొదలైనవి), ఐడీ ప్రూఫ్, ఫీజు చెల్లింపు, మౌలిక సదుపాయాల కోసం అవసరమైతే భూమిని అప్పగించేందుకు రూ. 100 స్టాంప్‌ పేపర్‌పై నోటరీ అండర్‌టేకింగ్‌ సమర్పించాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తు: దరఖాస్తుదారులు టీజీఐఐసీ పోర్టల్‌ ద్వారా 10 శాతం డెవలప్‌మెంట్‌ ఇంపాక్ట్‌ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
వెరిఫికేషన్‌: జోనల్‌ మేనేజర్, ఐఏఎల్‌ఏ కమిషనర్‌ 4 రోజుల్లోగా పరిశీలించి హెడ్‌ ఆఫీస్‌ స్రూ్కటినీ కమిటీకి పంపుతారు. 
ఆమోదం: స్రూ్కటినీ కమిటీ 3 రోజుల్లో అప్రూవల్‌ కమిటీకి పంపితే స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ 7 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటుంది. 

బ్యాలెన్స్‌ ఫీజు: అనుమతి వచ్చిన వెంటనే మిగిలిన 90 శా­తం ఫీజు కోసం డిమాండ్‌ నోటీసు జారీ చేస్తారు. నోటీసు అందుకున్న 45 రోజుల్లో 45% ఫీజు, తొలి వాయిదా చెల్లించిన 45 రోజుల్లో మిగిలిన మొత్తం చెల్లించాలి. ఆలస్యమైతే నెలకు 1 శాతం జరిమానా ఉంటుంది. నెల దాటితే మొత్తం రద్దవుతుంది. చెల్లించిన ఫీజు వెనక్కి ఇవ్వరు. 
మాస్టర్‌ ప్లాన్‌ మార్పు: ఫీజు అందిన 3 రోజుల్లో పురపాలక శాఖ/హెచ్‌ఎండీఏ రికార్డుల్లో భూ వినియోగ మార్పులు చేస్తారు. 

ఏమిటీ హిల్ట్‌–పీ పాలసీ? 
దాదాపు 50–60 ఏళ్ల క్రితం నాచారం, మల్లాపూర్, జీడిమెట్ల, సనత్‌నగర్, బాలానగర్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాలు నగరం వెలుపల పారిశ్రామిక జోన్లుగా ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం ఇవన్నీ నగర నడి»ొడ్డుకు చేరాయి. ఫలితంగా నివాసాల మధ్య కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 22 పారిశ్రామికవాడల్లో ఉన్న దాదాపు 9,300 ఎకరాల భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు పరిశ్రమల శాఖ జీవో 27 విడుదల చేసింది. నగరంలో ఉన్న రెడ్, ఆరెంజ్‌ కేటగిరీ కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ అవతలికి తరలించి హైదరాబాద్‌ను కాలుష్య ముప్పు నుంచి కాపాడటం, ఖాళీ అయిన పారిశ్రామిక భూముల్లో ఐటీ పార్కులు, రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, మాల్స్, స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వడం ఈ పాలసీ లక్ష్యం.

Advertisement
 
Advertisement
Advertisement