హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్‌సేఫ్టీపై స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో ఫుడ్‌సేఫ్టీ వింగ్‌ను ఏర్పాటు చేస్తారు. డీపీఆర్ రెడీ చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైడ్రా, ఈగల్ తరహాలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ వింగ్ ఉండనుంది. ఆహార కల్తీ, తనిఖీలు, సేఫ్టీపై చర్యలు తీసుకోనుంది ఈ వింగ్. త్వరలోనే విధివిధానాలతో పూర్తి వివరాలు క్యాబినెట్ ముందుకు రానున్నాయి.
కాగా, ఫుడ్ సేఫ్టీపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్ సైడ్ ఆహారం తయారీ, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగం సమయంలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదు. దీనివల్ల ఆహారం కలుషితం, బ్యాక్టీరియా, వైరస్‌లు, రసాయనాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనిని నివారించడంలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ వింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.
పరిశుభ్రమైన ఆహారం ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం, గడువు ముగిసిన ఉత్పత్తులను ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలు ఫుడ్ సేఫ్టీలో భాగం. నాణ్యమైన ఆహారాన్ని అందించే బాధ్యతను వ్యాపార సంస్థలు మరుస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తే ఆహార కల్తీ బాధలు, అంటువ్యాధులు తగ్గి సమాజం మరింత ఆరోగ్యంగా ఉంటుంది.


