అసద్‌పై హైదరాబాద్‌లో పోటీ చేస్తా.. అల్లా దయ ఉంటే ఓడించి తీరుతా: జగ్గారెడ్డి

Telangana: Jagga reddy Comments On Mp Asaduddin Owaisi - Sakshi

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి   

సాక్షి, హైదరాబాద్‌: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌పై హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వెల్లడించారు. రాహుల్‌గాంధీని హైదరాబాద్‌లో పోటీ చేయాలని అసదుద్దీన్‌ సవాల్‌ చేయడం బేకార్‌ అని, ఆయనపై పోటీకి తానే వస్తానని వ్యాఖ్యానించారు. పోటీ చేయడమే కాదని, అల్లా దయ ఉంటే ఓడించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.

శనివారం గాంధీభవన్‌లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ రాహుల్‌ ఏమన్నారని అసదుద్దీన్‌ సవాల్‌ చేశారని ప్రశ్నించారు. ‘తెలంగాణ ఇచ్చిన నాయకుడిగా ఇక్కడి ప్రజలు, రైతులు, విద్యార్థులు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు రాహుల్‌ వచ్చారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం గాంధీలది. కనీసం మైనార్టీల కోసం కూడా పోరాటం చేయలేని కుటుంబం ఒవైసీలది.

కేసీఆర్‌ ఇస్తానన్న 12 శాతం రిజర్వేషన్ల గురించి ఏరోజైనా అసద్‌ అడిగారా?’ అని అన్నారు. పాతబస్తీ ముస్లింలు ఎంఐఎం గుండాయిజం చూసి భయపడి బయటకు రావడం లేదు. అసదుద్దీన్‌కు దమ్ముంటే హైదరాబాద్‌ వదిలి బయటకు రాగలరా’ అని ప్రశ్నించారు. ‘ప్రధాని మోదీ వచ్చే సమయంలో రాష్ట్రంలో లేకుండా     సీఎం కేసీఆర్‌ ఏ ధైర్యంతో వెళ్లారో చెప్పాలి. తెలంగాణ అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి రాజ్యసభ సభ్యులుగా ఎందుకు అవకాశం ఇవ్వలేదో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి’ అని జగ్గారెడ్డి నిలదీశారు. 
చదవండి: కాంగ్రెస్‌ ‘రైతు రచ్చబండ’ షురూ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top