సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు(ఏప్రిల్ 12, ఆదివారం) విడుదల కాబోతున్న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యార్థులు నేరుగా తమ మొబైల్‌లోనే పొందే వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితాల కోసం విద్యార్థులు ఎటువంటి పోర్టల్ లాగిన్ అవసరం లేకుండా, మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా అవకాశం కల్పించింది.
జస్ట్.. 8096958096 నెంబర్‌కు వాట్సాప్ (WhatsApp)కు మెసేజ్ పంపడం ద్వారా ఫలితాలను పొందవచ్చని ప్రకటించింది. ఇప్పటికే ఈ నెంబర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం పలురకాల సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ ధృవీకరించారు.
మొదట మీ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ నంబర్ 8096 95 8096 నంబర్‌ను సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పంపాలి. సర్వీస్ ఎంపికలో మెనూలో BIE Exam Result అని టైప్ చేసి, 'Open Service' ఆప్షన్ నొక్కాలి. అక్కడ మీ హాల్ టికెట్ (రోల్) నంబర్ నమోదు చేసి, సంవత్సరం (1st/2nd Year), స్ట్రీమ్ (General/Vocational) ఎంచుకోవాలి. వివరాలు సమర్పించిన వెంటనే మీ ఫలితం మెసేజ్ రూపంలో తక్షణమే స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
స్టెప్ బై స్టెప్ ఇలా..
8096 95 8096ని మీ కాంటాక్ట్‌లలో "MeeSeva Telangana"గా సేవ్ చేయండి
WhatsApp తెరిచి "Hi" పంపండి.. మీసేవ చాట్‌బాట్ మొదలవుతుంది.
"BIE Exam Result" టైప్ చేసి Open Service నొక్కండి
మీ రోల్ నంబర్ నమోదు చేయండి, సంవత్సరం (1వ/2వ) మరియు స్ట్రీమ్ (జనరల్/వొకేషనల్) ఎంచుకోండి
సబ్మిట్ చేయండి.. మీ ఫలితం WhatsAppలో తక్షణమే వస్తుంది.
రేపు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రెండూ విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి 1,495 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అలాగే 5 పరీక్ష కేంద్రాలు పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యా ర్థులు 4,89,126 మందికి, రెండో సంవత్సరం విద్యార్థులు 5,07,949 మందికి హాల్ టికెట్లు జారీ అయ్యాయి. మార్చి 18న పరీక్షలు పూర్తి కావడానికి ముందే మూల్యాంకనం మొదలైంది. దీంతో ఆ నెలాఖరుకే ఫలితాలు సిద్ధమయ్యాయి.


