
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో హై కోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. రెండు నెలలుగా లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న విషయం విదితమే. 2024, అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. లక్షలాది మంది భవిష్యత్‌కు సంబంధించిన అంశం కావడంతో మూడు నెలలపాటు అన్ని పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు నమోదు చేసుకుంది. అందరి వాదనలు ముగిసిన తర్వాత జూలై 7న తీర్పు రిజర్వు చేసింది. నేడు తీర్పు వెల్లడించేందుకు పిటిషన్లను లిస్ట్ చేసింది. జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనున్నారు.