
పోలవరానికి మేం సమ్మతినిచ్చినట్లేనన్న విభజన చట్ట నిబంధన దీనికి వర్తించదు
కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ లేఖ
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుకు తాము సమ్మతి ఇచ్చినట్లేనంటూ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 90 (3)లో ఉన్న నిబంధన గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు వర్తించదని తెలంగాణ స్పష్టం చేసింది. పోలవరం విస్తరణలో భాగంగా చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు తమ అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది.
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)లోని 95వ టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) పోలవరం ప్రాజెక్టును ఆమోదిస్తూ గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగా జారీ చేసిన ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్స్‌లో బనకచర్లతో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేసింది.
రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించడానికి చేపట్టిన ప్రాజెక్టులో రోజుకు 3 టీఎంసీల జలాల తరలింపునకు వీలుగా ఏపీ సర్కారు సదుపాయాలను సృష్టిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పునర్విభజన చట్టం, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిబంధనలతోపాటు ఆ ప్రాజెక్టుకు జారీ చేసిన పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను చేపట్టరాదంటూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తాజాగా లేఖ రాశారు.
‘అన్ని మిగులు జలాలు ఉమ్మడి ఏపీకి చెందుతాయని గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో ఉన్న నేపథ్యంలో ఆ జలాల ఆధారంగా ప్రతిపాదించిన బనకచర్లకు ఉమ్మడి ఏపీ నుంచి వేరుపడిన తెలంగాణ సమ్మతి తప్పనిసరి. ఈ ప్రాజెక్టు తెలంగాణ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించనుంది. బేసిన్‌లో చివరి రాష్ట్రం కావడంతో బనకచర్ల ప్రాజెక్టును చేపట్టే హక్కు ఉందని ఏపీ పేర్కొనడం పూర్తిగా గోదావరి ట్రిబ్యునల్ తీర్పును వక్రీకరించడమే. వరద జలాల పంపిణీ గురించి ట్రిబ్యునల్ తీర్పులో ఎలాంటి ప్రస్తావన లేదు’అని లేఖలో ఆయన పేర్కొన్నారు.
లేఖలోని ముఖ్యాంశాలు...
వరద జలాల పంపిణీకి ప్రాతిపదిక లేదు..
‘బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించి అక్కడి నుంచి పెన్నా బేసిన్‌లోని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలించాలని ఏపీ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ, 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టు గోదావరి బేసిన్ పరిధిలోకి రాదు. పూర్తిగా కృష్ణా, పెన్నా బేసిన్ల పరిధిలోకి ఆయకట్టు రానుండటం వల్ల ఈ అంశంపై పునఃపరిశీలన జరపాలి.
రాష్ట్రాల మధ్య వరద జలాల పంపిణీపై గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో ఎలాంటి నిబంధన లేదు. భారీ మొత్తంలో జలాలను బేసిన్ వెలుపలి ప్రాంతాలకు ఏపీ తరలించడంతో ఇప్పటికే కృష్ణా బేసిన్ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్ మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించడం పూర్తిగా కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పునకు విరుద్ధం’అని లేఖలో తెలంగాణ పేర్కొంది.
విభజన చట్టంలోని సెక్షన్లు 84 (3) (2), 85 (8సీ/8డీ) ప్రకారం కొత్త ప్రాజెక్టులన్నింటికీ తొలుత సంబంధిత నదీ యాజమాన్య బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉండగా బనకచర్ల విషయంలో ఏపీ ఈ నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపిందని వివరించింది.
బనకచర్లతో పోలవరం గేట్ల నిర్వహణలో మార్పులు జరిగి బ్యాక్‌వాటర్‌తో తెలంగాణ భూభాగంలో ముంపు సమస్య మరింత తీవ్రమై దుమ్ముగూడెం బరాజ్ మునుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాక్‌వాటర్ మరింత పెరిగితే భద్రాచలం పట్టణం, ఆలయంతోపాటు పరిసర గ్రామాలు, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ ముంపునకు గురవుతాయని పేర్కొంది.
పోలవరంపై పీపీఏకే ఆ అధికారం..
బనకచర్లలో భాగంగా పోలవరం ప్రాజెక్టు ఫోర్‌షోర్ నుంచి నీటిని తరలించనుండటంతో ఆ పనులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పరిధిలోకి వస్తాయని తెలంగాణ తెలిపింది. విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన పీపీఏ.. పోలవరం పనులను టీఏసీ, సీడబ్ల్యూసీ అనుమతులకు కట్టుబడి నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. టీఏసీ, సీడబ్ల్యూసీ అనుమతుల్లేకుండా బనకచర్ల పేరుతో పోలవరం ప్రాజెక్టు విస్తరణ పనులను పీపీఏ అనుమతించరాదని కేంద్రాన్ని తెలంగాణ కోరింది. బనకచర్లకు పర్యావరణ, ఇతర అనుమతులను కోరే అధికారం పీపీఏకే ఉందని స్పష్టం చేసింది.
పోలవరం ద్వారా 449.78 టీఎంసీల తరలింపునకు డీపీఆర్ రూపొందగా... తాజాగా మరో 200 టీఎంసీలను ఇదే ప్రాజెక్టు ద్వారా తరలించడానికి బనకచర్లను ఏపీ ప్రతిపాదించడం వల్ల పోలవరం ద్వారా తరలించనున్న మొత్తం జలాలు 650 టీఎంసీలకు పెరిగి ప్రాజెక్టు అపరేషన్ షెడ్యూళ్లలో మార్పులు చోటుచేసుకుంటాయని లేఖలో తెలంగాణ వాదించింది. ఇది ఉమ్మడి ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిశాల మధ్య కుదిరిన ఆపరేషన్ షెడ్యూల్ ఒప్పందానికి విరుద్ధమని గుర్తుచేసింది.
75 శాతం లభ్యతతో 449.78 టీఎంసీల తరలింపునకే పోలవరానికి సీడబ్ల్యూసీ అనుమతించగా.. బనకచర్ల పేరుతో అంతకుమించి మిగులు జలాలను ఏపీ తరలించాలనుకోవడం ఆ అనుమతులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధమని పేర్కొంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు జారీ చేసిన పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా అదనపు పనులు చేపట్టడంతో 2011లో పనుల నిలుపుదలకు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసిందని.. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని గుర్తుచేసింది.