
నేటి సీఎంల భేటీ ఎజెండాను సవరించండి.. కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర సర్కారు లేఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనతో అప్రమత్తం
అనుమతులే లేని ప్రాజెక్టుపై చర్చ
అసమంజసమంటూ తీవ్ర అభ్యంతరం
చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పులన్నింటినీ ఉల్లంఘిస్తూ ఆ ప్రాజెక్టు చేపట్టారని వెల్లడి
ఇప్పటికే గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని లేఖలో ప్రస్తావించిన సీఎస్
డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని విజ్ఞప్తి
తెలంగాణ ప్రతిపాదనలే ఎజెండాలో చేర్చాలని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం ఎజెండాలో గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టుపై చర్చ అసమంజసమని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని, వెంటనే ఎజెండాను సవరించాలని కోరింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రాసిన ఈ లేఖలో బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలన్నింటినీ సీఎస్ ప్రస్తావించారు.
బనకచర్లే సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదన
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ భేటీ సింగిల్ (ఏకైక) ఎజెండాగా బనకచర్లపై మాత్రమే చర్చించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ లేఖ రాసింది. తెలంగాణ చేసిన పలు ప్రతిపాదనలను ఎజెండాలో చేర్చాలని కోరింది.
కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపు అంశాన్ని ఎజెండాలో చేర్చి చర్చించాలని ఇప్పటికే కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరింది.
అలాగే తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ పథకం కింద సాయం, గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, నిధుల కేటాయింపు వంటి అంశాలను చేర్చాలని విజ్ఞప్తి చేసింంది. తాజాగా ఇప్పుడు కూడా ఈ అంశాలపైనే చర్చించాలని సీఎస్ స్పష్టం చేశారు.
ఆ సంస్థల విశ్వసనీయత దెబ్బతింటుంది..
బనకచర్ల ప్రాజెక్టుపై గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర పర్యావరణ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ తీవ్ర అభ్యంతరాలు తెలపడాన్ని సీఎస్ గుర్తు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా, చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నింటినీ ఉల్లంఘిస్తూ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేనేలేదని తేల్చి చెప్పారు. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టును కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించారు. సీడబ్ల్యూసీ కూడా ఈ రిపోర్టును తిరస్కరించాలని కోరారు. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలు ఇవే..
⇒ పరీవాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా, అంగీకారం తీసుకోకుండా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రాలకు ట్రిబ్యునల్ జరిపిన నీటి కేటాయింపుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రాజెక్టుల నిర్వహణలో సైతం మార్పులు చోటుచేసుకుంటాయి. ఏకపక్షంగా 200 టీఎంసీలను తరలించాలని చేసిన ప్రతిపాదనతో పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్‌లో మార్పులు జరగడంతో పాటు తెలంగాణ నీటి హక్కులకు విఘాతం కలుగుతుంది.
⇒ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుకు అనుమతుల జారీకి సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ నుంచి క్లియరెన్స్‌లు అవసరం కాగా, బనకచర్ల ప్రాజెక్టుకు ఇవేమీ లేవు.
⇒ ఏపీ సమర్పించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టులో కీలకమైన సమాచార లోపాలున్నాయి. నీటి లభ్యత, సాంకేతిక సమాచారం లోపించింది.
⇒ పోలవరం ప్రాజెక్టుతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడే ముంపుపై ఇప్పటికే న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమయంలో ఈ ప్రాజెక్టును ఎలా చేపడతారు?
⇒ ఈ ప్రాజెక్టు తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాలను హరిస్తుంది. ప్రధానంగా కరువు పీడిత ప్రాంతాలపై దుష్ప్రభావం చూపుతుంది.
అన్ని ప్రక్రియలూ పూర్తైన తర్వాతే చర్చించాలి
⇒ చట్టబద్ధంగా రావాల్సిన అన్ని అనుమతులు, అంతర్రాష్ట్ర సంప్రదింపులు, అభ్యంతరాల పరిష్కారం వంటి ప్రక్రియలు పూర్తైన తర్వాతే ఈ ప్రాజెక్టుపై అయినా, ఏ సమావేశంలోనైనా చర్చ జరగాలి. ఆ తర్వాతే ప్రాజెక్టును ఆమోదించాలి.
⇒ బనకచర్ల ద్వారా తరలించనున్న 200 టీఎంసీల గురించి పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌లో ప్రస్తావన లేదు. నీటి లభ్యత, అంతర్రాష్ట్ర ప్రభావాలపై సమగ్ర అధ్యయనంతో పాటు ట్రిబ్యునల్ తీర్పులను నికచ్చిగా అమలు చేస్తేనే ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందని పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) స్పష్టం చేసింది.
⇒ బనకచర్ల ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, 1980 ఏప్రిల్ 2న జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం అమలు తీరులో మార్పులు చోటుచేసుకుంటాయని గోదావరి బోర్డు అభ్యంతరం తెలిపింది. ఎలాంటి మార్పులకైనా పరీవాహకంలోని అన్ని రాష్ట్రాల నుంచి తప్పనిసరిగా రాతపూర్వకంగా సమ్మతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గోదావరి జలాల బట్వాడా విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఒప్పందం లేదని కూడా తెలిపింది. 80 టీఎంసీలకు మించి జలాలను ఇతర బేసిన్లకు మళ్లిస్తే బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాలని కృష్ణా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పులు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది.
⇒ గోదావరి ట్రిబ్యునల్ పరీవాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు కేటాయించిన నికర జలాల కోటాలను పూర్తిగా వాడుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ప్రాజెక్టులను నిర్మించిన తర్వాతే బనకచర్ల ప్రాజెక్టుకు ప్రతిపాదించిన 200 టీఎంసీల లభ్యతపై స్పష్టత వస్తుందని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది.
⇒ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధమని పేర్కొంటూ బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరించిన విషయాన్ని సైతం లేఖలో తెలంగాణ ప్రస్తావించింది. అన్ని రకాల అనుమతులు సాధించిన తర్వాతే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని కోరిందని తెలిపింది.
చర్చకు పెడితే బాయ్‌కాట్!
కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగే సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి వారు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే ఈ సమావేశానికి హాజరైనప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్లపై చర్చకు ఒప్పుకునేది లేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ బనకచర్లను ఎజెండాలో పెట్టి చర్చ ప్రారంభిస్తే నిరసన వ్యక్తం చేస్తూ బాయ్‌కాట్ చేస్తారని తెలుస్తోంది. కాగా, వీలును బట్టి సీఎం బుధవారం రాత్రికి, లేదా గురువారం నగరానికి వస్తారని సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.