సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చే 7 రకాల సీడ్స్‌ను ప్రభుత్వం గుర్తించింది. బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సొన), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్ఎం-7715 రకాల విత్తనాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ ఏడు వరి రకాలకే బోనస్ వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం గుర్తించిన సీడ్స్ మాత్రమే విక్రయాలు చేయాలని మంత్రి ఆదేశించారు.
విత్తన కంపెనీలు, ఫెర్టిలైజర్ డీలర్లు, కృషి వాస్ నిర్వాహకులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్ల డిమాండ్, మిల్లర్ల సూచన మేరకు ప్రభుత్వం సూచించిన 7 రకాల విత్తనాల సరఫరాలపై కంపెనీల ప్రతినిధులు, యూనివర్సిటీ, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి చర్చించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్‌పై ఫెర్టిలైజర్ డీలర్ల అభిప్రాయాలను, సూచనలను మంత్రి తుమ్మల అడిగి తెలుసుకున్నారు. కృషి వాస్ ప్రతినిధులతో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సాగు సాంకేతికతపై ఆయన చర్చించారు.


