క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం 

Telangana Govt Give House site Documents To Kinnera Mogilaiah - Sakshi

క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ 

షూటర్‌ ఈషా సింగ్, కిన్నెర మొగిలయ్యలకు ఇళ్ల స్థలాల పత్రాలు అందజేత 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారని తెలిపారు. గురువారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ప్రముఖ షూటర్‌ ఈషా సింగ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యలకు ఒక్కొక్కరికి 600 గజాల ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ పత్రాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అందజేశారు.

ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. షూటర్‌ ఈషా సింగ్, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌లు వివిధ క్రీడాపోటీల్లో తెలంగాణ ప్రతిభను చాటి చెప్పారని, వారికి రూ. 2 కోట్ల చొప్పున ప్రభుత్వ నజరానాతో పాటు 600 చదరపు గజాల ఇంటి స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గౌరవిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలో నూతన స్పోర్ట్స్‌ పాలసీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. పాలమూరుకు చెందిన కిన్నెర కళాకారుడు మొగిలయ్య ప్రతిభను తెలంగాణ ప్రభుత్వమే తొలుత గుర్తించి గౌరవించిందని అన్నారు. ఆయనకు కుటుంబ పోషణకోసం నెలకు రూ. 10 వేలు ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. కిన్నెర కళను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తరువాతే కేంద్రం మొగిలయ్యకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిందన్నారు.

ఈ సందర్భంగా కోటి రూపాయల నజరానాతో పాటు ఇంటి స్థలం పట్టా పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని.. తదనుగుణంగా ఆయన కోరుకున్న చోట ఇంటి స్థలం ఇస్తున్నామని తెలిపారు. కాగా, తన కళను గుర్తించి గౌరవించడంతో పాటు ఇంటి స్థలం, కోటి రూపాయలు ఇచ్చిన మహనీయుడు కేసీఆర్‌ అని కిన్నెర మొగిలయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.  

కొందరికి జూబ్లీహిల్స్‌.. మొగిలయ్యకు బీఎన్‌ రెడ్డి నగర్‌లోనా?  
పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయింపుపై అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు అసహనానికి గురయ్యారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా బాలరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు చెప్పకుండానే మొగిలయ్యకు ఇంటి స్థలం పంపిణీ చేశారని, స్థానిక శాసనసభ్యుడిగా స్థలం పంపిణీ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ జాతి, ఖ్యాతిని జాతీయ.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన క్రీడాకారులు, కళాకారులకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో స్థలాలు ఇచ్చారని, మొగిలయ్యకు మాత్రం బీఎన్‌రెడ్డి నగర్‌లో ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు.  అయితే, తదనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో తనకు విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని  స్పష్టం చేశారు.

ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం గురించి తనకు ముందస్తు సమాచారం లేకపోవడంపై మాత్రమే మంత్రి సహాయక సిబ్బందిపై తాను ఆగ్రహం వ్యక్తం చేశానని బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top