తెలంగాణ: పులి గర్జిస్తోంది | Telangana: Government Takes Measures To Protect Tigers | Sakshi
Sakshi News home page

తెలంగాణ: పులి గర్జిస్తోంది

Aug 1 2021 2:39 AM | Updated on Aug 1 2021 11:03 AM

Telangana: Government Takes Measures To Protect Tigers - Sakshi

అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న పెద్దపులుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న పెద్దపులుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో చేపడుతున్న అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చర్యలతో రెండుమూడేళ్లుగా వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 40 దాకా (ఎనిమిది పులి పిల్లలను కలుపుకుని) పులులు ఉండొచ్చునని అంచనా. గడ్డిభూముల పెంపకంతో శాకాహార జంతువుల సంఖ్య బాగా పెరగడం కూడా దీనికి కలిసొస్తోంది.

రాష్ట్రంలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌), కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ (కేటీఆర్‌)ల విస్తీర్ణం పెద్దగా ఉండడంతో పులుల సంఖ్య వృద్ధికి అనుకూల పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక పులి స్వేచ్ఛగా తిరిగి, జీవనాన్ని సాగించేందుకు 50 చదరపు కి.మీ. అడవి అవసరమవుతుంది. దీన్నిబట్టి రాష్ట్రంలోని ఏటీఆర్, కేటీఆర్‌లో కలిపి దాదాపు 5 వేల చ.కి.మీ. ఉండడంతో వంద దాకా పులులు జీవించేందుకు, స్థిరనివాసం ఏర్పర్చుకునేందుకు అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. 

ఏపీ, తెలంగాణల్లో 3 అభయారణ్యాలు 
దేశవ్యాప్తంగా 54 టైగర్‌ రిజర్వ్‌లుండగా, వాటిలో 2 వేల చ.కి.మీ.పైబడి అటవీ వైశాల్యమున్న నాలుగైదు అభయారణ్యాల్లో మూడు ఏపీ, తెలంగాణల్లోనే ఉన్నాయి. ఏటీఆర్‌లో 30దాకా (ఐదు పులికూనలతో సహా) పులులుండగా.. కేటీఆర్‌లో పదిదాకా (మూడు పిల్లలు కలిపి) పులులున్నట్టు అంచనా. ఏపీలోని నాగార్జునసాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ (ఎన్‌ఎస్‌టీఆర్‌)లో 60దాకా పులులుండొచ్చని చెబుతున్నారు.

తెలంగాణలో 30 ఏళ్లుగా పులులు కనిపించకుండా పోయిన ప్రదేశాలు, కొత్త ప్రాంతాల్లోనూ అవి కనిపిస్తుండడం, వాటి పాదమూద్ర లు రికార్డవడం ముఖ్యమైన పరిణామంగా అటవీ అధికారులు పేర్కొంటున్నారు. పొరుగున మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబాల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో అక్కడ చోటు సరిపోక, సానుకూల వాతావరణం లేక తెలంగాణలో మెరుగైన అటవీ విస్తరణ, వేట కు తగినసంఖ్యలో జంతువులు, నీటివనరులు వంటివి ఉండడంతో ఇక్కడకు తరలివస్తున్నాయి.  

కోవిడ్‌ నేర్పిన పాఠాన్ని గుర్తుంచుకోవాలి 
కోవిడ్‌ సంక్షోభం మనందరికీ ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణులను గౌరవించాలని, కాపాడుకోవాలని నొక్కి చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని 3 టైగర్‌ రిజర్వ్‌లు నదుల ఒడ్డునే ఉండడంతో పాటు ఈ అడవుల్లోంచే అత్యధిక వాటా నీరు నదుల్లోకి చేరుతోంది. దీంతో ఈ అభయారణ్యాల్లోని పులులను పరిరక్షించుకోవాల్సిన అవసరముంది. పులుల ఆవాసాల ద్వారా పర్యావరణపరంగా అందుబాటులోకి వచ్చే సేవలను (ఎకోలాజికల్‌ సర్వీసెస్‌ ద్వారా) డబ్బుపరంగా లెక్కిస్తే ఒక్కో పులి రూ.250 కోట్ల విలువ చేస్తుంది. 


– ఇమ్రాన్‌ సిద్దిఖీ, హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ 

పులితోనే జీవవైవిధ్యం 
ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక పులి మీద అడవి, పర్యావరణం, ప్రకృతి, జంతుజాలం, గడ్డి భూములు, జీవవైవిధ్యం వంటివి ఆధారపడి ఉన్నందున పులుల మనుగడ అనేది మానవాళి కొనసాగేందుకు కూడా ప్రధానమన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. రాష్ట్రంలో వంద పులులు స్చేచ్ఛగా జీవనం సాగించేందుకు, ఆవాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అనువైన పరిస్థితులున్నాయి. 2018 టైగర్‌ సెన్సెస్‌ ప్రకారం ఇక్కడ ఏటీఆర్, కేటీఆర్‌లలో కలుపుకుని 26 పులులున్నట్లుగా వెల్లడైంది. 


– శంకరన్, వైల్డ్‌లైఫ్‌ ఓఎస్డీ, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ 

పులికూనల సంఖ్యా పెరుగుతోంది 
గతంతో పోలిస్తే ఏటీఆర్‌లో పులుల సంఖ్య పెరిగేందుకు అన్ని సానుకూల పరిస్థితులున్నాయి. ఇటీవల కెమెరా ట్రాప్‌లకు చిక్కడంతో పాటు, రాత్రిళ్లు అడవిలో రోడ్లు దాటుతూ కనిపిస్తున్నట్లు ఫారెస్ట్‌ సిబ్బంది చెబుతున్నారు. పులుల అభయారణ్యాల విస్తీర్ణం ఎక్కువగా ఉండడం పెద్దపులులు స్థిరనివాసం ఏర్పరుచుకునేందుకు దోహదం చేస్తున్నాయి. పులులతో పాటు పులికూనలు, పిల్లల సంఖ్య కూడా పెరగడం శుభపరిణామం. 
– కృష్ణాగౌడ్, డీఎఫ్‌వో, నాగర్‌కర్నూల్‌ జిల్లా   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement