సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ సర్కార్ ఆదేశించింది. కాలేజీల్లో తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పోలీస్, విద్యా శాఖ సహకారంతో కాలేజీల్లో తనిఖీలు చేపట్టనున్నారు. కాలేజీల్లో సౌకర్యాలు, విద్యార్థుల నమోదుపై నివేదిక ఇవ్వాలని విజిలెన్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
కాగా, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు లేబొరేటరీ, లైబ్రరీ ఫీజులు భారీగా పెంచగా.. ఒక్కో కాలేజీ ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ కొంతమంది విద్యార్థులు ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అదనంగా కట్టించుకునే ఫీజులకు కాలేజీ యాజమాన్యాలు ఎలాంటి రశీదులు ఇవ్వడం లేదని విద్యార్థులు తెలిపారు. అదనపు ఫీజులు కట్టకపోతే క్లాసుకు హాజరైనా అటెండెన్స్ ఉండదని, ఫలితంగా పరీక్ష రాసే అవకాశం కోల్పోతారని బెదిరిస్తున్నట్టు విద్యార్థులు వాపోతున్నారు.
లైబ్రరీ, లేబొరేటరీ ఫీజు కింద అదనంగా ఏటా రూ.12 వేల వరకూ తీసుకోవాలని ప్రభుత్వం గతంలో జీఓ ద్వారా పేర్కొంది. కొన్నేళ్లుగా ఈ ఫీజులో ఎలాంటి మార్పూ లేదు. కానీ కొన్ని కాలేజీలు లైబ్రరీ, లేబొరేటరీ ఫీజు కింద గతేడాది రూ.20 వేల వరకూ వసూలు చేశాయి. ఈ ఏడాది నుంచి ఈ ఫీజును ఏకంగా రూ. 30 నుంచి రూ. 50 వేల వరకూ పెంచారు. క్యాంపస్ నియామకాలకు శిక్షణ ఇచ్చేందుకు కాలేజీలు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నాయి.ఏటా రూ.30 నుంచి రూ.60 వేల వరకూ విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థికి స్కిల్ నేర్పించడం కాలేజీల బాధ్యత. అవేమీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
మరోవైపు, వచ్చే నెల 1వ తేదీ నాటికి ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 900 కోట్లు విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య హెచ్చరించింది. ఒకవేళ బకాయిలను విడుదల చేయకపోతే నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు స్పష్టం చేశారు.


