
సాగు ముందుకు సాగక ఆందోళనలో రైతాంగం
రాష్ట్రవ్యాప్తంగా ఈ సమయానికి సగటున 185 సెం.మీ. వర్షం కురవాల్సి ఉండగా 165 సెంటీమీటర్లే నమోదు
ఏకంగా 20 సెం.మీ. లోటు వర్షపాతంతో సాగుకు ఇబ్బందులు
ఈ సీజన్‌లో పంటల సాగు అంచనా 1.32 కోట్ల ఎకరాలు
ఇప్పటివరకు సాగైంది కేవలం 56.26 లక్షల ఎకరాలే
చాలాచోట్ల వేసిన విత్తనాలు మొలకెత్తలేదు
మొలకలు వచ్చినా ఎండిపోయే పరిస్థితి
పెట్టుబడి కూడా వచ్చేలా లేదంటున్న రైతులు
ప్రతికూల పరిస్థితుల్లోనూ అధికంగా సాగైన పత్తి.. వరి అంతంతే!
పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.. ఈ ఏడాది వ్యవసాయానికి తగ్గట్టుగా వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నం. నాతో పాటు చాలామంది రైతులు అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి పత్తి పంట వేశారు. కానీ వర్షాలు సరిగా లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు. నేను మూడున్నర ఎకరాల్లో రెండుసార్లు గింజలు పెడితే ఎకరన్నరలోనే ఓ తీరుగా మొలిచినయ్. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – మురావత్ రాంసింగ్, లోక్యతండా, వేలేరు మండలం, హనుమకొండ జిల్లా
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఈ వానాకాలం సీజన్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో రైతాంగం సతమతమవుతోంది. ముఖ్యంగా జూలైలో పది రోజులు దాటినా ఇప్పటివరకు సరైన వర్షాలు లేకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మేలో వర్షాలు కురవడంతో మురిసిపోయిన రైతాంగం.. గతేడాదిలా ఈసారి కూడా సాగు సాఫీగా సాగుతుందని భావించారు. కానీ వానాకాలం సీజన్ ముగింపు దశకు చేరుకున్నా ఇంకా లోటు వర్షపాతమే ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 42.48 శాతం విస్తీర్ణంలోనే పంటల సాగు జరిగింది.
ఈ సీజన్‌లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 56,26,243 (42.48 శాతం) ఎకరాల్లోనే రైతులు వివిధ పంటలు వేశారు. అయితే సరైన వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెట్టుబడి సైతం దక్కే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు.
లోటు వర్షపాతంతో కష్టకాలం
గత సీజన్‌లో ఈ సమయానికి రాష్ట్ర సగటు వర్షపాతం 191.90 సె.మీ.లు ఉండాల్సి ఉండగా..అంతకు మించి 224.90 సె.మీ.లు నమోదు అయ్యిది. అయితే ఈ సీజన్‌లో మాత్రం అతి తక్కువగా కేవలం 165.5 సె.మీ.లే నమోదు కావడం గమనార్హం. గత సీజన్‌లో కరీంనగర్, ములుగు, ఖమ్మం, బి.కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 20 నుంచి 59 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాలలలో 60 శాతానికి పైగా (లార్జ్ ఎక్సెస్) వర్షం పడగా, 21 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
అయితే ఈసారి మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, సూర్యాపేట, యాదగిరి భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో 20 నుంచి 59 శాతం లోటు వర్షాపాతం ఉంది. తక్కిన 23 జిల్లాల్లో 19 శాతం వరకు లోటు వర్షం ఉంది. ఈ నేపథ్యంలోనే సాగు నెమ్మదించిందని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు.
ఒక్క ఆదిలాబాద్‌లోనే 95% మించి సాగు
ఈ వానాకాలంలో ఆదిలాబాద్ జిల్లాలో సాగు అంచనా 5,77,255 ఎకరాలు అయితే 5,51,573 (95.55 శాతం) ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. అంటే ఆదిలాబాద్‌లో దాదాపు అంచనాలకు తగినట్టుగా సాగు జరిగిందన్న మాట. ఆ తర్వాతి స్థానాల్లో కేబీ ఆసిఫాబాద్ (76.33 శాతం), సంగారెడ్డి (66.81 శాతం), నిజామాబాద్ (65.36 శాతం), బి.కొత్తగూడెం (61.85 శాతం) జిల్లాలు ఉన్నాయి. ఇక అతి తక్కువ విస్తీర్ణంలో సాగైన జిల్లాల్లో వనపర్తి 2,46,582 ఎకరాలకు గాను 17,879 (7.25 శాతం) ఎకరాల్లో సాగుతో మొదటి స్థానంలో ఉంది.
ఇక సూర్యాపేటలో 5,81,915 ఎకరాలకు 44,195 (7.59 శాతం) ఎకరాలలో, మెదక్‌లో 3,37,641 ఎకరాలకు 32,789 (9.71 శాతం) ఎకరాలలో, ఎం.మల్కాజిగిరిలో 23,430 ఎకరాలకు గాను 2,583 (11.02 శాతం) ఎకరాల్లో, ములుగులో 1,26,973 ఎకరాలకు 19,877 (15.65 శాతం) ఎకరాల్లో పంటలు వేశారు. కాగా ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు పత్తి పంటపైనే ఆసక్తి చూపారు. పత్తి సాగు అంచనా 48,93,016 ఎకరాలకు గాను 36,30,988 (74.21 శాతం) ఎకరాలలో సాగయ్యింది. వరిసాగు అంచనా 62,47,868 ఎకరాలకు గాను కేవలం 5,01,129 (8.02 శాతం) ఎకరాల్లోనే సాగయ్యింది. వర్షాలు లేకపోవడం వరిసాగుపై తీవ్రంగా ప్రభావం చూపించింది.
ప్రత్యామ్నాయంగా తృణ ధాన్యాలు, ఆహారేతర పంటలు...
వర్షాభావం, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం ఈసారి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపింది. ముఖ్యంగా ప్రధాన తృణ ధాన్యాలు (మిల్లెట్స్), ఆహారేతర పంటలపై దృష్టి పెట్టినట్లు సాగు విస్తీర్ణాన్ని బట్టి అవగతమవుతోంది. మేజర్ మిల్లెట్స్ (జొన్న, మొక్కజొన్న, రాగులు) 5,73,643 ఎకరాల్లో సాగవచ్చని అంచనా వేయగా అంచనాలకు తగినట్టుగా 5,61,240 (97.84 శాతం) ఎకరాల్లో ఈ పంటలు వేశారు. మొక్కజొన్న 5,21,206 ఎకరాలకు గాను 5,34,318 (102.52 శాతం) ఎకరాలలో సాగైంది. ఆహారేతర పంటలు 1,02,576 ఎకరాలు అంచనా వేయగా రెట్టింపునకు మించి 2,35,614 (229.70 శాతం) ఎకరాల్లో రైతులు దైంచా, పిల్లిపెసర, సన్ హెంప్, పారాగ్రాస్, మేత జోవార్‌లు సాగు చేశారు.
నారు పోసిననప్పటి నుంచి వానలు లేవు..
మే నెలలో వానలు పడితే ఈసారి కాలం మంచిగనే అయితది అనుకున్నం. ఆ వానలు తప్ప మల్ల చినుకు పడలేదు. ఆలస్యంగనైన వరి ఏద్దమని ఆగినం. పది రోజుల కింద మబ్బులు చేసి తుంపురు తుంపురు వానలు పడ్డయి. కాలం మంచిగైతే నాట్లు వేసుకోవచ్చని నమ్మి నారు పోసినం. ఇగ వర్షాలు పడుతలేవు. చెరువులు, కుంటలల్ల కూడా నీళ్లు లేవు. ఎటూ తోస్తలేదు. – యెడబోయిన పద్మ, మహిళా రైతు, గ్రామం బేతోల్, మహబూబాబాద్ జిల్లా
వానాకాలం 2025 సాగు ప్రణాళిక.. సాగైన విస్తీర్ణం (ఎకరాలలో)
– ఈ వానాకాలం సాగు అంచనా ః 13244305
– ఇప్పటివరకైన సాగు విస్తీర్ణంః 5626243
– పత్తి సాగు అంచనాః 4893016
– సాగైన పత్తి విస్తీర్ణంః 3630988
– వరిసాగు అంచనాః 6247868
– సాగైన వరి విస్తీర్ణంః 501129
– మొక్కజొన్న సాగు అంచనాః 521206
– సాగైన మొక్కజొన్న విస్తీర్ణంః 534318