అలా చేస్తే చర్యలు తప్పవు: డీజీపీ | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలకు డీజీపీ మహెందర్‌ రెడ్డి విజ్ఞప్తి

Published Wed, Aug 12 2020 8:26 PM

Telangana DGP Request People Be Cautious On Social Media Posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమయ్యాయో తెలుసుకోవాలని కోరారు. శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని ప్రజలను కోరుతున్నామని అన్నారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తారని, అలాంటి వారిపై వారిపై వెంటనే కేసులు పెట్టి, తగిన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని స్టేషన్లకూ, సీనియర్ అధికారులకూ ఆదేశాలిచ్చామని తెలిపారు.
(చదవండి: బెంగుళూరు అల్ల‌ర్ల‌పై సీఎం సీరియ‌స్)

ప్రజలు పోలీసులతో సహకరించి భద్రత, రక్షణలో తెలంగాణ అత్యున్నతంగా నిలిచేలా సహకరించాలని కోరారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. కాగా, కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్‌ సోషల్‌ మీడియాలో ఓ కమ్యూనల్‌ పోస్టు షేర్‌ చేయడంతో బెంగుళూరులో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి.
(ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. చెలరేగిన హింస)

ఆలోచించి పోస్టు చేయండి: అంజనీకుమార్‌
సోషల్‌ మీడియాలో ఏదైనా పోస్ట్‌ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని హైదరాబాద్‌ నగర కమిషనర్‌ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. ఒక పోస్ట్‌ ఫలితంగా బెంగళూరులో ఘర్షణలు జరిగాయని గుర్తు చేశారు. బాధ్యత లేని, అభ్యంతరకరమైన సోషల్‌ మీడియా పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement