వేగంగా ఇళ్ల నిర్మాణం కోసం కలెక్టర్లకు మరిన్ని అధికారాలు
సాదాబైనామాలపై ఆర్డీవోలదే తుది నిర్ణయం
తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలు
గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లకు గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులైన నిరుపేదలు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా వారికి ఇళ్లు మంజూరు చేసేందుకు సిద్ధమని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అర్హులకు ఇళ్లు మంజూరు చేయటమనేది నిరంతర ప్రక్రియ అని ఆయన చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మరింత వేగంగా జరిగేందుకు వీలుగా అధికార వికేంద్రీకరణతో జిల్లా కలెక్టర్లకు మరిన్ని అధికారాలు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవడంతోపాటు పనుల పురోగతిలో సమస్యలు రాకుండా చూడటానికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఇందిరమ్మ, రెవెన్యూ అంశాలపై ఇన్‌చార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి లోతైన సమీక్ష నిర్వహించారు. ఇళ్లు మంజూరై వివిధ కారణాలతో నిర్మాణా నికి సిద్ధంకాని వారు.. తమకు ఇల్లు అవసరం లేదని తెలిపితే వారి స్థానంలో ఇతర అర్హులకు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ సాంకేతిక కారణాలతో బిల్లులు రానివారికి తక్షణమే విడుదల చేయాలన్నారు.
గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేయడంతోపాటు ఆయా కాలనీల్లో మౌలికవసతులు కల్పించాలని చెప్పారు. ఇంటి బేస్‌మెంట్ నిర్మాణం పూర్తయిన ఇళ్లకు రూ. లక్ష మంజురు చేశాక.. సాంకేతిక కారణాలతో బిల్లులు రాని వారికి తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేయాలని.. మౌలికవసతులు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలన్నారు.
భూ సర్వేతోనే వివాదాలకు శాశ్వత పరిష్కారం...
భూ సర్వేతోనే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాపుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని.. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సర్వే మ్యాపు నంబర్, భూధార్ నంబర్ కేటాయిస్తు న్నామని తెలిపారు. సాదాబైనామాలకు సంబంధించి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్క రిస్తామని వివరించారు. కొనుగోలుదారుడు ఒక్కడే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని.. దరఖా స్తుల పరిష్కారం వేగవంతానికి ఆర్డీవోలకే అధికారాలు కల్పించినట్లు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని.. తొలివిడతలో శిథిలావస్థకు చేరిన చోట నిర్మిస్తామన్నారు. దశాబ్దాల నుంచి రెవెన్యూ, ఫారెస్టు, ఎండోమెంట్, వక్ఫ్ భూముల మధ్య సరిహద్దు వివాదాలున్నాయని.. ఉమ్మడి సర్వే నిర్వహించి ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో నిజామాబాద్ ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఆదిలాబాద్ ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్, ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్‌రెడ్డి, పోచారం శ్రీనివా స్‌రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా ఎంపీలు, ఎమ్మె ల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్ కుమార్, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.


