వ్యవసాయం పండుగైన నాడే సంపూర్ణ సంక్రాంతి

Telangana CM KCR Extends Sankranti Wishes - Sakshi

భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌   

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవాత్మక ప్రగతి స్ఫూర్తితో యావత్‌ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే భారతదేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. పంటపొలాల నుంచి ధాన్యపు రాశులు ఇళ్లకు చేరుకున్న శుభసందర్భంలో రైతన్న జరుపుకునే సంబురమే సంక్రాంతి పండుగని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునేరోజే సంక్రాంతి పండుగ అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పునరుజ్జీవింప చేసేందుకు చేపట్టిన కార్యాచరణతో తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలు, ధాన్యరాశులు, పాడి పశువులు, కమ్మని మట్టివాసనలతో సంక్రాంతి శోభను సంతరించుకుని వైభవోపేతంగా వెలుగొందుతున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయరంగ బలోపేతానికి లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు.

రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 2,16,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని, రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఇది తార్కాణమని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి కోటీ 31 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్న సాగు విస్తీర్ణం, ఇప్పుడు 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు.

వ్యవసాయరంగాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం తెలంగాణ రైతుల్లో తొణికిసలాడుతున్నదని, దీన్నే దేశ రైతాంగంలో పాదు కొల్పుతామని స్పష్టం చేశారు. ఈ దిశగా యావత్‌ భారత ప్రజల సహకారం, సమష్టి కృషితో దేశ వ్యవసాయరంగంలో గుణాత్మక అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలంతా మకర సంక్రాంతి పండుగను సుఖసంతోషాలు, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రతీ ఇల్లు సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top