మార్గం ఉన్నా.. మోక్షం ఏదీ? | Telangana CM assures regularisation of sada bainama land | Sakshi
Sakshi News home page

మార్గం ఉన్నా.. మోక్షం ఏదీ?

Mar 22 2026 4:14 AM | Updated on Mar 22 2026 5:45 AM

Telangana CM assures regularisation of sada bainama land

తెలంగాణలో 37 ఏళ్లుగా నలుగుతున్న సాదాబైనామాల సమస్య

భూభారతి చట్టంతో పరిష్కార మార్గం లభించినా చాలా దరఖాస్తులు తిరస్కరణ  

అమ్మిన వ్యక్తి అఫిడవిట్‌ ఇవ్వాలనే నిబంధనతో ఎదురవుతున్న అడ్డంకులు 

ఆ వ్యక్తి పేరిట భూమి ఉండాలంటున్న అధికారులు 

సర్వే నంబర్లు, విస్తీర్ణంలో తేడాలు కనిపించినా తప్పని ఇబ్బందులు 

ప్రత్యేక ఉత్తర్వుల జారీతోనే పరిష్కారం లభిస్తుందంటున్న భూచట్టాల నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వాలు మారినా రాష్ట్ర రైతాంగం దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సాదాబైనామాల సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. దాదాపు 37 ఏళ్లుగా తెలంగాణ రైతాంగాన్ని వేధిస్తున్న ఈ సమస్యకు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక పరిష్కార మార్గం దొరికినా మోక్షం మాత్రం కలగట్లేదు. భూభారతి చట్టంలో సాదాబైనామాలను చట్టబద్ధం చేసే ప్రక్రియకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి ఏడు నెలలు గడుస్తున్నా లక్షలాది సాదాబైనామా దరఖాస్తులు మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.  

అడ్డంకిగా అఫిడవిట్‌ నిబంధన.. 
సాదాబైనామాల సమస్యకు పరిష్కారం చూపించే భూభారతి చట్టం గతేడాది ఏప్రిల్‌ 14 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆగస్టు నెలాఖరులో హైకోర్టు అందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వెంటనే గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచి్చన ప్రభుత్వం ఆయా దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియను ప్రారంభించింది. అంతవరకూ బాగానే ఉన్నా చట్టంలో పేర్కొన్న విధంగా సాదాబైనామాలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ రూపొందించిన నిబంధనలు మళ్లీ సమస్యను జటిలం చేశాయి. గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని 2014 జూన్‌ 2లోగా తెల్లకాగితం (సాదాబైనామా)తో కొని ఉంటే అమ్మిన వ్యక్తి అఫిడవిట్‌ ఇవ్వాలని.. అప్పుడే సాదాబైనామా సరి్టఫికెట్‌ ఇవ్వాలనే నిబంధన పెట్టారు.

దీంతో ఎప్పుడో దశాబ్దాల క్రితం తమకు అమ్మిన వారి నుంచి అఫిడవిట్‌లు తెచ్చుకోలేక చాలా మంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఆ నిబంధన ఎత్తేసే దిశగా చర్యలు ప్రారంభించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా వస్తాయని.. అమ్మినవారి అఫిడవిట్‌తో సంబంధం లేకుండా గతంలో లాగానే స్థానిక విచారణ ద్వారా సాదాబైనామాలను పరిష్కరిస్తామని రెవెన్యూ వర్గాలంటున్నాయి. కానీ ఈ అఫిడవిట్‌కు మించిన సమస్యలు సాదాబైనామా దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్నాయన్న విషయం ప్రభుత్వం దృష్టికి రాకపోవడం గమనార్హం.

సాదాబైనామా దరఖాస్తును పరిష్కరించాలంటే ఆ భూమికి సంబంధించి భూభారతి పోర్టల్‌లో ఉన్న వివరాల్లో అమ్మిన వ్యక్తి పేరుపై పట్టా ఉండాలన్న నిబంధన ఈ సమస్యకు పీటముడి వేస్తోంది. ఎప్పుడో భూమి అమ్మినా ధరణి పోర్టల్‌ వచ్చాక తన పేరిట పట్టా రావడంతో అప్పట్లో అమ్మిన వ్యక్తి ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయడం లేదంటే కుటుంబ సభ్యుల పేర్లపై పట్టా బదిలీ చేయడం లాంటివి జరిగిపోయాయి. చాలా చోట్ల సర్వే నంబర్లు సరిపోలట్లేదు. భూమి ఒకచోట ఉంటే మరో సర్వే నంబర్‌పై కాగితం ఉండటంతో ఆ దరఖాస్తులను కూడా రెవెన్యూ అధికారులు పరిష్కరించట్లేదు. కాగితాలపై రాసుకున్న విస్తీర్ణం, భూభారతి పోర్టల్‌లో ఉన్న విస్తీర్ణంలో తేడా ఉన్నా పరిష్కరించలేమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

ఇలా చాలా దరఖాస్తులను తిరస్కరించామంటున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలన్నింటికీ వివరణ ఇస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నుంచి ఆర్డీవోలకు ప్రత్యేక ఉత్తర్వులు రావాలని.. అప్పుడే సాదాబైనామాలు పూర్తిస్థాయిలో పరిష్కారమవుతాయని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. సాదాబైనామాలకు త్వరలోనే పరిష్కారం చూపుతామని ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌ ప్రకటించిన నేపథ్యంలో అఫిడవిట్‌ నిబంధన ఎత్తేయడంతోపాటు సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.  

అప్పుడు అలా... ఇప్పుడు ఇలా 
వాస్తవానికి సాదాబైనామాలను పరిష్కరించే ప్రక్రియ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. కానీ సాదాబైనామాల పరిష్కారానికి దరఖాస్తులను స్వీకరించిన అప్పటి ప్రభుత్వం ధరణి చట్టంలో ఈ అంశాన్ని ప్రస్తావించడాన్ని విస్మరించింది. దీంతో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించే అవకాశమే లేకుండా పోయింది. ఆ తర్వాత విషయం కోర్టు మెట్లెక్కింది. కోర్టు కూడా చట్టంలో లేనందున పరిష్కారం ఎలా చేస్తారని ప్రశ్నించింది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచి్చన కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభారతి చట్టంలో సాదాబైనామాల పరిష్కారానికి ప్రత్యేక సెక్షన్‌ రూపొందించడంతో కోర్టు కూడా వాటి పరిష్కారానికి అనుమతినిచ్చింది. దీంతో ఇక సమస్య పరిష్కారమైనట్టేనని 9.2 లక్షల మంది దరఖాస్తుదారులు ఆశించారు. కానీ నేటికీ సమస్య అలాగే మిగిలిపోయింది. 

ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తే.. 
ప్రభుత్వం సాదాబైనామాల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించాలి. భూభారతి చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం సాదాబైనామా సర్టిఫికెట్‌ జారీ చేసిది ఆర్డీవో అయినప్పటికీ కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకొనే వెసులుబాటు ఉంది. ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తే తిరస్కారానికి గురైన రైతులు కలెక్టర్లకు అప్పీల్‌ చేసుకోవడం ద్వారా సాదాబైనామాల దరఖాస్తుదారులకు న్యాయం జరుగుతుంది. – భూమి సునీల్‌ కుమార్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు   

Advertisement
 
Advertisement
Advertisement