పథకం రెండో విడత కింద మంజూరు.. నియోజకవర్గానికి 2 వేల చొప్పున కేటాయింపు
రాష్ట్రంలోని 14,800 పూరి గుడిసెల స్థానంలో ఇందిరమ్మ ఇళ్లు
క్యూర్ ఏరియాలో లక్ష ఎల్‌ఐజీ,ఎంఐజీ ఇళ్ల నిర్మాణం
ఎల్‌ఐజీ ఇళ్లకు రూ. 5 లక్షలతోపాటు అన్‌డివైడెడ్ షేర్ ఉచితం
ఎంఐజీ లబ్ధిదారులకు స్వల్ప లాభంతో ఇళ్ల కేటాయింపు
‘ఆర్డీఎస్‌ఎస్’లో చేరేందుకు ఓకే
వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు రూ. 1,000 కోట్లు
జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు
రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 2.5 లక్షల గృహాలు నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను కేటాయించింది. 2 వేల ఇళ్లలో 1,500 ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారులకు గతంలో ఇచ్చిన తరహాలోనే ఇళ్ల నిర్మాణం లెవల్‌నుబట్టి దశలవారీగా మొత్తం రూ. 5 లక్షలను ప్రభుత్వం చెల్లించనుంది. మిగిలిన 500 ఇళ్లను గతంలో వివిధ గృహనిర్మాణ పథకాల కింద మంజూరై వివిధ కారణాలతో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికి కేటాయించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో కలిసి గృహనిర్మాణ, సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
అసంపూర్తి ఇళ్లకు ఇందిరమ్మ అండ...
ఉమ్మడి ఏపీలో దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం, గత ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులతోపాటు ఇంకా ఎవరైనా లబ్ధిదారుల ఇళ్లు అసంపూర్తిగా మిగిలి ఉంటే ఈ పథకం కింద ప్రయోజనం కల్పించనున్నారు. పునాదులు పూర్తై గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ. 3 లక్షలు, గోడలు పూర్తై శ్లాబు నిలిచిపోయిన ఇళ్లకు రూ. 2 లక్షల చొప్పున సహాయం చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. మూడో, నాలుగో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సైతం అసంపూర్తిగా మిగిలిన ఇళ్లకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు ప్రస్తుత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అనర్హులని తొలి విడతలో ప్రభుత్వం చెప్పింది. నాడు సిమెంట్, స్టీల్, నగదు రూపంలో రూ. 25 వేలు తీసుకున్న వారిని రెండోవిడత ఇందిరమ్మ పథకం కింద అర్హులుగా పరిగణించాలని తాజాగా మంత్రివర్గం నిర్ణయించింది. ఆ రూ. 25 వేలను మినహాయించుకొని రూ. 5 లక్షల్లో మిగిలిన మొత్తాన్ని వారికి అందజేయనుంది.
గుడిసె లేని రాష్ట్రంగా...
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 14,800 పూరి గూడిసెలున్నట్లు వివిధ దఫాలుగా చేసిన సర్వేల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రెండో విడత ఇందిరమ్మ పథకం కింద ఆయా కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని నిర్ణయించింది.
క్యూర్‌లో లక్ష ఇళ్ల నిర్మాణం..
ఇందిరమ్మ పథకం కింద కోర్ అర్బన్ ఏరియా (క్యూర్) పరిధిలో 6–7 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 18,500 మందికి మాత్రమే సొంత స్థలాలు ఉన్నాయి. వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 5 లక్షలను నెలాఖరులోగా ప్రభుత్వం మంజూరు చేయనుంది. మిగిలిన దరఖాస్తుదారుల్లో సొంత స్థలాలు లేని 3–3.5 లక్షల మంది అర్హలుంటారని ప్రభుత్వం అంచనా వేసింది. క్యూర్ ఏరియాలోని గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గాన్ని యూనిట్‌గా పరిగణించి అల్పాదాయ వర్గాలు (ఎల్‌ఐజీ), మధ్యతరగతి వర్గాల (ఎంఐజీ)కు లక్ష ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది.
ఎల్‌ఐజీ ఇళ్ల పథకం కింద 400–420 చదరపు గజాల విస్తీర్ణంతో ఫ్లాట్ల నిర్మాణానికి రూ. 5 లక్షలతోపాటు అన్‌డివైడ్ ల్యాండ్ షేర్‌ను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల అదనపు వ్యయాన్ని లబ్ధిదారులు భరించాల్సి రానుంది. నిరుపేదలు జీవనోపాధి కోసం ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఎల్‌ఐజీ ఇళ్లను నిర్మించనున్నారు. మురికివాడల్లో నివసిస్తే అక్కడే కట్టిస్తామని పొంగులేటి తెలిపారు. వారు ఉండే ప్రాంతంలో ప్రభుత్వ స్థలం లేకుంటే హౌసింగ్ బోర్డు, ఇతర ప్రభుత్వ శాఖల నివాసయోగ్యమైన భూముల్లో వారి కోసం ఇళ్లను నిర్మించనున్నారు.
నియోజకవర్గం యూనిట్‌గా ఇప్పటికే కొన్ని స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. ఇక క్యూర్ ఏరియాలో నిర్మించనున్న లక్ష ఇళ్లలో 30 శాతం ఇళ్లను ఎంఐజీ లబ్ధిదారులకు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అన్‌డివైడెడ్ ల్యాండ్ షేర్‌తోపాటు ఫ్రీహోల్డ్ నిర్మాణానికి సంబంధించిన వ్యయాన్ని నామమాత్ర లాభంతో ఎంఐజీ వినియోగదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేసి ఆ నిధులను ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని నిర్ణయించింది. ఎల్‌ఐజీ, ఎంఐజీ పథకాల విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక, లబ్ధిదారులకు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ తదితర వివరాలను ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లతో ఎల్‌ఐజీ, ఎంఐజీ ఇళ్ల పథకాలకు తేడా ఉందన్నారు. గత ప్రభుత్వం లబ్ధిదారులు జీవనోపాధి పొందుతున్న ప్రాంతానికి 30–40 కి.మీ.ల దూరంలో ఇళ్లను కట్టడంతో ఆ ఇళ్లను లబ్ధిదారులు నిరుపయోగంగా వదిలేశారని తెలిపారు.
జూన్ 1న లక్ష గృహ ప్రవేశాలు...
తొలివిడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేయగా వాటిలో పూర్తైన లక్ష ఇళ్లలో గృహప్రవేశాలను జూన్ 1న నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ప్రారంభించనున్నారు. ఇదే కార్యక్రమంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేయనున్నారు.
గోదావరి పుష్కరాలకు రూ. 1,000 కోట్లు
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. తొలి విడతగా రూ. 300 కోట్లు మంజూరు చేసింది.
ఆర్డీఎస్‌ఎస్‌లో చేరేందుకు సై..
విద్యుత్ పంపిణీ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం 2021లో ప్రవేశపెట్టిన ఆర్డీఎస్‌ఎస్ పథకంలో చేరాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సామర్థ్యం పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వ పథకం రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్‌ఎస్) పథకం కింద చేరాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో చేరడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017 జనవరి 2న కేంద్రంతో త్రెపాక్షిక ఒప్పందం చేసుకున్నా అమలు చేయలేదని మంత్రి పొంగులేటి చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగుదల కోసం ఈ పథకంలో చేరాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందంలో మీటర్లు (వ్యవసాయ కనెక్షన్లకు) అమర్చేందుకు అంగీకరిస్తూ సంతకం చేసిందని ఆరోపించారు. తమ నిర్ణయంలో మీటర్లు బిగించే ప్రసక్తే లేదన్నారు.
లైఫ్ సైన్స్ పాలసీకి ఆమోదం
రాష్ట్రాన్ని 2030 నాటికి ప్రపంచంలోని టాప్–5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టడానికి నెక్స్‌ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30ని మంత్రివర్గం ఆమోదించింది. దావోస్ సదస్సులో ఈ పాలసీని సీఎం ఆవిష్కరించగా కొన్ని మార్పులతో తాజాగా మంత్రివర్గం ఆమోదించింది. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలతోపాటు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్ హెల్త్, గ్లోబల్ ఇన్నోవేషన్ రంగాల్లో మంచి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు ఫార్మా ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టగా ఇకపై ఆవిష్కరణలపై ఎక్కువ దృష్టిపెట్టాలని నిర్ణయించింది. ఆర్ అండ్ డీ యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించేలా ఈ పాలసీలో మార్పులు చేసింది.
ఇంటర్ విద్యార్థులకూ భోజనం, అల్పాహారం..
రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు అన్ని జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారంతోపాటు పాలు అందించనుంది.
‘పాలమూరు’భూసేకరణకు రూ. 587 కోట్లు
పాలమూరు–రంగారెడ్డి పథకం మిగులు పనులతోపాటు చివర్లో ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించిన భూసేకరణ కోసం తొలి విడతగా రూ. 587 కోట్లు కేటలాయించాలని కేబినెట్ తీర్మానించింది. ప్రాజెక్టును 21 ప్యాకేజీలుగా విభజించి చేపట్టిన గత ప్రభుత్వం 18 ప్యాకేజీల పనులనే కొంత మేర చేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కాగా, జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీలను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని, తెలంగాణ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను ‘హాకా’లో విలీనం చేయాలని కేబినెట్ తీర్మానించింది.


