TS: ‘పవర్‌’ నిషేధం ఎత్తివేత

Telangana barred from power exchanges - Sakshi

తెలంగాణ విద్యుత్‌ ఎక్స్ఛేంజీల నుంచి కొనుగోళ్లు తిరిగి ప్రారంభం

బకాయిల విషయంలో తప్పును సరిదిద్దుకున్న కేంద్ర ప్రభుత్వం

ప్రైవేటు కంపెనీల కోసమే కేంద్రం అనవసర జోక్యమంటూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాల విద్యుత్‌ బకాయిలు, కొనుగోళ్లపై నిషేధం అంశంలో కేంద్ర ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకుంది. నిర్దేశిత గడువు ముగిసినా.. విద్యుదుత్పత్తి కంపెనీలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు బకాయిలు చెల్లించలేదన్న ప్రకటనను వెనక్కి తీసుకుంది. గడువులోగానే చెల్లింపులు చేశామన్న తెలంగాణ వాదనను అంగీకరించింది. ఎనర్జీ ఎక్సేంజ్‌ల ద్వారా విద్యుత్‌ క్రయవిక్రయాలు జరపకుండా రాష్ట్ర డిస్కంలపై విధించిన నిషేధాన్ని శనివారం ఎత్తివేసింది. కేంద్రం నిషేధాన్ని సడలించిందని, ఎనర్జీ ఎక్సేంజ్‌ల నుంచి విద్యుత్‌ కొనుగోళ్లను పునః ప్రారంభించామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోల సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు.

మూడుసార్లు మాట మార్చి..
నిర్దేశిత గడువు ముగిసినా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించలేదంటూ.. తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 29 డిస్కంలను కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. ఈ డిస్కంలు ఎనర్జీ ఎక్స్ఛేంజీల ద్వారా క్రయవిక్రయాలు జరపకుండా గురువారం అర్ధరాత్రి నుంచి నిషేధం విధించింది. ఇందులో తెలంగాణ డిస్కంలు రూ.1,380 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్టు పేర్కొంది. అయితే తెలంగాణ, ఏపీ సహా చాలా రాష్ట్రాలు తాము గడువులోగానే బకాయిలు చెల్లించామని కేంద్ర ప్రభుత్వానికి వివరించాయి. దీనితో మరుసటి రోజు శుక్రవారమే ఏపీ సహా పలు రాష్ట్రాలపై నిషేధాన్ని కేంద్రం సడలించింది. తెలంగాణ బకాయిలను పునః సమీక్షించి రూ.52 కోట్లే చెల్లించాల్సి ఉందని పేర్కొంది. మళ్లీ తెలంగాణ డిస్కంలు సంప్రదింపులు జరిపి, బకాయిలు చెల్లించేసిన ఆధారాలను చూపాయి. తిరిగి పరిశీలన జరిపిన కేంద్రం రాష్ట్ర బకాయిలు రూ.7 కోట్లేనని సరిదిద్దుకుంది. ఈ బకాయిని రాష్ట్ర డిస్కంలు వెంటనే చెల్లించేయడంతో నిషేధాన్ని సడలించింది.

ప్రైవేటు కంపెనీల కోసం అనవసర జోక్యం!
కేంద్ర విద్యుత్‌ శాఖ కొత్తగా అమల్లోకి తెచ్చిన లేట్‌ పేమెంట్‌ సర్చార్జీ రూల్స్‌–2022 ప్రకారం.. డిస్కంలు విద్యుదుత్పత్తి కంపెనీలకు 45రోజుల గడువులోగా బిల్లులు చెల్లించాలి. ఆ గడువు దాటి మరో నెల గడిచినా చెల్లించకుంటే.. ఆ తర్వాతి రోజును ‘డిఫాల్ట్‌ ట్రిగ్గర్‌ డేట్‌’గా పరిగణిస్తారు. అంటే ఆ రోజు నుంచి 75 రోజుల్లోగా బకాయిలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొనుగోళ్లు జరపకుండా సదరు డిస్కంలను కట్టడి చేసే నిబంధనను కేంద్రం తెచ్చింది. ఈ అధికారాన్ని జాతీయ గ్రిడ్‌ నిర్వహణను పర్యవేక్షించే ‘పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ (పోసోకో)’కు కట్టబెట్టింది.

దీనిని తెలంగాణ సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. కేవలం ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలకు ప్రయోజనం కల్పించడానికే కేంద్రం ఈ నిబంధనలు తెచ్చిందని ఆరోపిస్తున్నాయి. నిజానికి గడువులోగా బకాయిల చెల్లింపులో డిస్కంలు విఫలమైతే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లోని నిబంధనల ప్రకారం.. విద్యుదుత్పత్తి కంపెనీలు చర్యలు తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కంపెనీలు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయొచ్చని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చని, కోర్టుకు వెళ్లవచ్చని అంటోంది. అయినా కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకుంటోందని మండిపడుతోంది. బకాయిల చెల్లింపుతో నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఎన్‌ఎల్డీసీ)కి ఏ సంబంధం లేకపోయినా రాష్ట్రాలకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేసే అధికారం దానికి కట్టబెట్టడం సరికాదని ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు.
చదవండి: ఇవి పార్టీల ఎన్నికలు కావు.. మన బతుకుదెరువు ఎన్నికలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top