Medaram Jatara 2022 News: ఆంక్షల నడుమ మేడారం జాతర? మొదటివారంలో కీలక సమావేశం

Telangana: Arrangements On For Medaram Jatara - Sakshi

కరోనా నేపథ్యంలో మేడారంపై ప్రభుత్వం పక్కాగా వ్యూహరచన 

నిర్వహణపై వచ్చేనెల మొదటివారంలో సమీక్షించాలని భావిస్తున్న ప్రభుత్వం 

పక్కా ఏర్పాట్లతో, పరిమిత సంఖ్యతో జాతర నిర్వహించే అంశంపై కసరత్తు 

ప్రస్తుతం రూ.75 కోట్లతో సాగుతున్న వివిధ అభివృద్ధి పనులు

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా వ్యవహరిస్తోంది. కోటికిపైగా భక్తులు హాజరుకానున్న ఈ జాతర వచ్చేనెల 16వ తేదీ నుంచి 19వ తేదీవరకు నాలుగు రోజులపాటు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి అత్యంత వేగంగా సాగుతోంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. రోజురోజుకూ వైరస్‌ వ్యాప్తి వేగం పెరుగుతున్న పరిస్థితుల్లో మేడారం జాతర వైరస్‌ వ్యాప్తికి కారణం కాకూడదని గిరిజన సంక్షేమ శాఖ అభిప్రాయపడుతోంది.ఇందులో భాగంగా వ్యూహాత్మక కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 

మొదటివారంలో ప్రత్యేక సమావేశం... 
వచ్చేనెలలో కోవిడ్‌ వ్యాప్తి తారాస్థాయికి చేరుతుందని వైద్య,ఆరోగ్య శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి మాసమంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేనెల మొదటివారంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వర్చువల్‌ పద్ధతిలో సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా ఉండేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఈ సమీక్ష కీలకం కానుంది. జాతరకు భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతివ్వాలా.. భౌతిక దూరాన్ని పాటిస్తూ అనుమతి ఇస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.. శానిటైజేషన్‌ ఏర్పాట్లు, మాస్కుల నిర్వహణ, తక్ష ణ వైద్య సేవల కల్పన తదితర అంశాలపై లోతు గా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

వడివడిగా నిర్మాణ పనులు 
ప్రస్తుతం జాతర పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 21 ప్రభుత్వ విభాగాలకు రూ.75 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం వివిధ పనులు నిర్దేశించింది. కోటికి పైగా భక్తులు/పర్యాటకులు హాజరు కానుండటంతో ప్రభుత్వం అక్కడ రవాణా, వసతికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. దీంతోపాటు తాగునీటి సరఫరా, భద్రత చర్యలు కీలకం కానున్నాయి. జాతరకు మంజూరు చేసిన మొత్తంలో దాదాపు 50శాతం నిధులు ఈ మూడు శాఖలకే ఖర్చు చేయనుంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top