1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా పథకం
కొత్తగా 2 లక్షల చేయూత పెన్షన్లు
ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం.. ప్రీస్కూల్ నుంచి ఇంటర్ వరకు బ్రేక్‌ఫాస్ట్
ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం.. ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ. 2వేల స్టైపెండ్
బడ్జెట్‌లో డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి లెక్కల పద్దుతోపాటు కొన్ని కొత్త పథకాలకూ బడ్జెట్ వేదికైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలకు నిధుల కేటాయింపును ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కొత్తగా 9 పథకాలనూ ప్రకటించారు. వాటి వివరాలను శుక్రవారం బడ్టెట్‌లో ప్రస్తావించారు. వీటిల్లో కొన్ని పూర్తి కొత్త పథకాలు కాగా, కొన్ని అమలులో ఉన్న వాటి పరిధి పెంచారు. వీటికి నిధులను ప్రతిపాదించారు.
‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా
కుటుంబానికి జీవనధారమైన ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు మరణిస్తే.. ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా బీమా సౌకర్యాన్ని క ల్పించాలని నిర్ణయించారు. ఈ పథకానికి ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’అని నామకరణం చేశారు. రాష్ట్రంలో దాదాపు 1.15 కోట్ల కుటుంబాలు ఉన్నాయని సామాజిక, ఆర్థిక తారతమ్యాలు లేకుండా అన్ని కుటుంబాలకు ఈ జీవిత బీమా పథకం వర్తిస్తుందని భట్టి ప్రకటించారు. బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 4వేల కోట్లు కేటాయించారు.
చేయూత కింద...
చేయూత పథకం కింద కొత్తగా అర్హులైన 2 లక్షల పెన్షన్లను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు దాదాపు 43 లక్షల మందికి చేయూత అందిస్తున్నారు. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.14,861 కోట్లు ప్రతిపాదించారు.
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు
రాష్ట్ర విద్యా కమిషన్ సూచన మేరకు మొత్తం 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఎంపిక చేసిన ఈ పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థ, ఇతర అన్ని వనరులతో కూడిన తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మార్పు చేయాలని ప్రతిపాదించారు. వీటిలో ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థులకు విద్య అందించనున్నారు. ఈ పథకానికి రూ.500 కోట్లు ప్రతిపాదించారు.
ఆరోగ్య భద్రత పథకం
ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ దాదాపు 23 లక్షల 51 వేల మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభించాలని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 421 ఎంప్యానెల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1,998 వ్యాధులకు చికిత్స పొందడానికి వీలుంటుంది. ప్రతీ ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తారు.
ఉద్యోగుల ప్రమాద బీమా పథకం
ఉద్యోగుల భద్రత కోసం దేశంలో తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే ఈ పథకం ద్వారా రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తిస్తుంది. 60 ఏళ్ల వరకు రూ.10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ 2 కోట్ల అదనపు కవరేజీ లభిస్తుంది. ఇది 7.57 లక్షల ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుంది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.1,056 కోట్లు ప్రతిపాదించారు.
విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మి డియెట్ వరకు విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతీ విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగి జావ అందిస్తారు. దీనికి బడ్జెట్‌లో రూ.800 కోట్లు కేటాయించారు.
ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మి డియెట్ అభ్యసిస్తున్న విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలల విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పథకం ఇంటర్ విద్యార్థులకూ దక్కనుంది.
సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రాం
విదేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. యువతకు వివిధ రంగాల్లో తగిన నైపుణ్య శిక్షణ, ఉపాధికి అవకాశం ఉన్న వివిధ దేశాల భాషల్లో అవగాహన క ల్పించటం, వారికి వీసా పొందటంలో మార్గనిర్దేశం చేయటం, విదేశీ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు, ఆయా దేశాల్లో ఆరోగ్య సేవలు కల్పించటం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశం. ఇందుకోసం సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నట్లు
బడ్జెట్‌లో వెల్లడించారు. దీనికి రూ.1,056 కోట్లు ప్రతిపాదించారు.
ఏటీసీ ట్రైనీలకు స్కాలర్‌షిప్
అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్స్ (ఏటీసీ)లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెలా రూ. 2 వేలు స్కాలర్íÙప్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి రూ.80 కోట్లు ప్రతిపాదించారు.


