
బిల్లుల చెల్లింపు సమయంలో గుర్తింపు
1,950 ఇళ్ల కేటాయింపు రద్దు
వాటిని అర్హులకు తిరిగి కేటాయించాలంటూ కలెక్టర్లకు లేఖలు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హుల ఎంపికకు జరిగిన సర్వేలో పెద్దఎత్తున తప్పులు దొర్లినట్టు వెలుగులోకి వస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో..1,950 ఇళ్లు అనర్హులకు అందాయని, వాటిని రద్దు చేసి అంతే సంఖ్యలో అర్హులను ఎంపిక చేసి ఆ ఇళ్లు మంజూరు చేయాలంటూ తాజాగా గృహనిర్మాణ శాఖ సంబంధిత జిల్లా కలెక్టర్లకు సూచించటం విశేషం. అనర్హుల గుర్తింపునకు ఇంకా సర్వే కొనసాగుతోంది.
అర్హులు అనర్హులుగా.. అనర్హులు అర్హులుగా..
తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్లను సొంతజాగా ఉన్నవారికే ఇవ్వాలని నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఇలాంటి వివరాల ఆధారంగా సర్వే చేసి అర్హులను తేల్చారు. ఈ సర్వే పక్కాగా జరిగిందని, లోపాలకు అవకాశం లేదని అప్పట్లో అధికారులు పేర్కొన్నారు. సర్వే యావత్తు జిల్లా కలెక్టర్ల ఆ«ధ్వర్యంలో జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లిన సిబ్బందిలో కొందరు దరఖాస్తులను సరిగ్గా పరిశీలించకుండా తోచిన వివరాలు నమోదు చేశారు. దీంతో అర్హులు అనర్హులుగా, అనర్హులు అర్హులుగా నమోదయ్యారు. ఆ వివరాల ఆధారంగా ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసింది. అలా మంజూరైన ఇళ్లలో వేల సంఖ్యలో అనర్హులున్నారని ఫిర్యాదులు అందాయి.
బిల్లులు మంజూరయ్యే సమయంలో లోపాలున్నట్టు గృహనిర్మాణ శాఖ కూడా గుర్తించింది. తొలి విడతలో ఇళ్లు మంజూరు జరగాల్సిన వారి స్థానంలో, తదుపరి విడతలో ఇళ్లను పొందాల్సిన వారున్నట్టు ఆ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఆ సంఖ్య 12,700గా అప్పట్లో తేలింది. వారందరి వద్దకు మళ్లీ సిబ్బందిని పంపి రీసర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు 90 శాతం సర్వే పూర్తయింది. అందులో సింహభాగం మంది అర్హులేఅని తేల్చారు. వివరాలు నమోదు చేసే సమయంలో కొన్ని తప్పులు దొర్లాయి తప్ప, వారంతా వాస్తవానికి అర్హులేనని గుర్తించారు.
కానీ, 1,950 మందికి నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు మంజూరయ్యాయని తేల్చారు. ఇప్పుడు ఈ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించి వారి స్థానంలో అర్హులను ఎంపిక చేయాలంటూ కలెక్టర్లకు లేఖలు రాశారు. అంటే, ఈ 1,950 మంది విషయంలో సర్వే సరిగా జరగలేదని తేలింది. సర్వే మొత్తం పూర్తయ్యాక మరికొంతమంది ఇలాంటి వారు తేలే అవకాశముంది.
వారి స్థానంలో వేరే వారికి ఇళ్లు: గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్
అనర్హుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి వారి స్థానంలో అర్హులకు ఇళ్లను మళ్లీ మంజూరు చేస్తామని గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా 1,950 మందికి ఇళ్లు మంజూరైనట్లుగా ఇప్పటి వరకు గుర్తించామని, వారి స్థానంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్లను తిరిగి కేటాయించమని కలెక్టర్లకు సూచించామని తెలిపారు. ఈ 1,950 మందిలో ఆర్సీసీ స్లాబ్ ఇంటిలో నివసిస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, గతంలో ప్రభుత్వ పథకంలో ఇళ్లు పొందినవారున్నారని తెలిపారు. ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో ఇళ్లు రద్దు చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు.