హాస్టల్‌లో ఏదో ఉందని! ఒంటిపై రక్కుతున్నట్లు, తమను లాగుతున్నట్లు అనిపిస్తోందని.. 

Student Of Mamidiguda Tribal Girls Ashram School Are Trembling With Fear - Sakshi

భయంతో బయటకు పరుగులు తీసిన విద్యార్థినులు 

అందరూ ఒకేసారి పరుగెత్తడంతో కిందపడి కొందరికి గాయాలు

ఆదిలాబాద్‌ జిల్లా ఆశ్రమ పాఠశాలలో ఘటన 

పాఠశాలను సందర్శించిన ఐటీడీఏ పీవో

ఆదిలాబాద్‌ రూరల్‌: హాస్టల్‌లో ఏదో ఉందని, తమ ఒంటిపై రక్కుతున్నట్లు, తమను లాగుతున్నట్లు అనిపిస్తోందని ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం మామిడిగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు భయంతో వణుకుతున్నారు. శుక్రవారం రాత్రి ఓ విద్యార్థినికి అలా అనిపించడంతో ఆమె పెద్దగా కేకలు వేసింది. దీంతో తోటి విద్యార్థినులు కూడా పెద్ద ఎత్తున కేకలు వేశారు. భయంతో ఏడుస్తూ అందరూ ఒకేసారి బయటకు పరుగులు తీశారు.

పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఒకేసారి బయ టకు రావడం తో పలువురు అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘట నలో కొంతమందికి గాయాలయ్యాయి. విద్యార్థినుల కేకలు, అరుపులు విన్న గ్రామస్తులు ఏం జరిగిందో తెలుసుకోవడానికి హుటాహుటిన ఆశ్రమ పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థినులకు ధైర్యం చెప్పి.. గాయప డినవారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వసతి గృహాంలో జరిగిన సంఘటనపై గ్రామ స్తులు ఉపాధ్యాయులకు సమాచారం అందజేశారు.

అయి తే వారు స్పందించకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. భయాందోళ నలో ఉన్న విద్యార్థినులకు ధైర్యాన్ని ఇచ్చేందుకు రాత్రి వసతి గృహంలోనే పలువురు గ్రామస్తులు ఉన్నారు. కాగా, శనివారం ఉదయం తరగతి గదులకు వెళ్లిన విద్యార్థినులు మళ్లీ భయంతో కేకలు, అరుపులతో ఒకరినొకరు తోసుకుంటూ బయటకు పరుగులు తీశారు.

ఈ క్రమంలో 50 మంది విద్యార్థినులు కిందపడి గాయపడ్డారు. స్థానికంగా ఉన్న ఏఎన్‌ఎంతోపాటు మరో ఇద్దరు హాస్టల్‌ సిబ్బంది ఎంత నచ్చజెప్పినా వారు ఏడుపు ఆపలేదు. అప్పటికే అక్కడ జరిగిన సంఘటనను విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సమాచారం అందజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు భయపడుతున్న పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. 
(చదవండి: ఉదయం పూలు అమ్ముతూ.. రాత్రి అయితే వేషం మార్చి..)

ఆశ్రమ పాఠశాలకు ఐటీడీఏ పీవో 
ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల భయాందోళన గురించి తెలుసుకున్న ఐటీడీఏ పీవో అంకిత్‌ శనివారం రాత్రి 8.30 గంటల కు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో దెయ్యం ఉందని.. తమ పిల్లలు భయపడుతున్నారని, పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తామని విద్యార్థినుల తల్లిదండ్రులు పీవోను కోరారు. అయితే అలాంటి వేమీలేవని, మూఢ నమ్మకాలు పెట్టుకోవద్దని పీవో.. విద్యార్థినులు, తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. 

ఎవరూ ముందుకు రావడం లేదు  
ఆశ్రమ పాఠశాలలో వార్డెన్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వసతిగృహంలో రాత్రి సమయంలో ఏఎన్‌ఎం, నైట్‌ డ్యూటీ వాచ్‌మన్‌ విధుల్లో ఉన్నారు. అయినా పిల్లలు భయపడ్డారు.  ఆస్పత్రిలో ఉన్న పిల్లలకు ధైర్యం చెప్పి తిరిగి హాస్టల్‌కి పంపించాను. ప్రస్తుతం వసతి గృహంలో పరిస్థితి అంతా బాగానే ఉంది.
– భాస్కర్, ఇన్‌చార్జి హెచ్‌ఎం, మామిడిగూడ ఆశ్రమ పాఠశాల

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top