
ములుగు జిల్లా దుసపాటి లొద్ది జలపాతంలో పడి విద్యార్థి మృతి
రంగారెడ్డి జిల్లాలో ఒకరి గల్లంతు
వాజేడు/అబ్దుల్లాపూర్‌మెట్: జలపాతాల వద్ద ఫొటోల సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. రెండు వేర్వేరు ఘటనల్లో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థి గల్లంతయ్యాడు. ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వాజేడు ఎస్సై జక్కుల సతీశ్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన హర్షారెడ్డి, శివరాంరెడ్డి, అభిరామిరెడ్డి, మహాశ్విన్(18), సాక్షిత్, అర్జున్, పూజ, రాకేశ్‌లు ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ సమీపంలోని దుసపాటి లొద్ది జలపాతం సందర్శనకు వచ్చారు.
ఇందులో పూజ, రాకేశ్ భార్యాభర్తలు. కాగా వీరంతా స్నేహితులు. ఈ క్రమంలో జలపాతం వద్ద ఫొటోలు దిగుతున్న కొండిశెట్టి మహాశ్విన్ నీటిలో జారి పడ్డాడు. వెంటనే పూజ అతడిని రక్షించడం కోసం నీటిలోకి దూకింది. మహాశ్విన్ భయంతో ఆమెను గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ నీటిలో మునిగారు. వెంటనే హర్షారెడ్డి, శివరాంరెడ్డి నీటిలోకి దూకారు. వారు కూడా నీటిలో మునిగిపోవడంతో అర్జున్ నీటిలోకి దూకి పూజ, హర్షారెడ్డి, శివరాంరెడ్డిని కాపాడాడు.
మహాశ్విన్‌ను కాపాడేందుకు తిరిగి నీటిలోకి వెళ్లేలోగానే అతడు గల్లంతయ్యాడు. దీంతో భయాందోళనకు గురైన మిగతావారు, ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో వారు గజఈతగాళ్లను పంపించారు. మధ్యాహ్నం సమయంలో మహాశ్విన్ మృతదేహం లభించింది. మృతుడు హైదరాబాద్‌లో బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నాడు. ఈ ఘటనపై వాజేడు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆనందం కోసం వస్తే..
వారంతా స్నేహితులు. సెలవు రోజు ఆనందంగా గడుపుదామని జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా అందులో ఓ ఇంటర్ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బేగంపేట రసూల్‌పుర ప్రాంతానికి చెందిన క్యామ సాయితేజ (17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఆదివారం మధ్యాహ్నం అతడు తన స్నేహితులైన సాయిరాం, నందు, మహేశ్, జయంత్, విష్ణు సుర్నార్, కార్తీక్, సునీల్‌లతో కలిసి కోహెడ శివారులో ఓఆర్‌ఆర్ సర్విస్‌రోడ్డు పక్కన ఉన్న వాటర్ ఫాల్స్ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో సరదాగా ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు సాయితేజ నీటిలో జారి పడిపోయి గల్లంతయ్యాడు. దీంతో మిగతావారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఫైర్ సిబ్బంది, డీఆర్‌ఎఫ్ బృందాలతో రాత్రి వరకూ గాలింపు చర్యలు చేపట్టారు. అయినా సాయితేజ ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.