వాట్సాప్‌లోనే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ సేవలు | Stamps and Registration services now on MeeSeva WhatsApp | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లోనే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ సేవలు

Apr 11 2026 4:53 AM | Updated on Apr 11 2026 4:53 AM

Stamps and Registration services now on MeeSeva WhatsApp

ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పనులు

8096958096 వాట్సాప్‌ నంబర్‌ ద్వారా సేవలు లభ్యం

సాక్షి, హైదరాబాద్‌: డిజిటల్‌ సేవల విస్తరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్‌ విభాగానికి సంబంధించిన సేవలను తాజాగా వాట్సాప్‌ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘ఈ వాట్సాప్‌ సేవ’ల ద్వారా భూమి సంబంధ పత్రాలు, సర్టిఫికెట్లు, ఇతర సేవలను ఎక్కడ నుంచైనా మొబైల్‌ ఫోన్‌ ద్వారా సులభంగా పొందవచ్చు. ఈ వాట్సాప్‌ సేవల ద్వారా రిజిస్ట్రేషన్‌ పత్రాల సర్టిఫైడ్‌ కాపీలు, ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ), స్టాంప్‌ల కొనుగోలు, ఫ్రాంకింగ్, డెఫిసిట్‌ చెల్లింపులు, సొసైటీలు, ఫర్మ్‌లు, సమాచార హక్కు (ఆర్‌టీఐ) దరఖాస్తులు, అపరాధ రుసుం చెల్లింపుల వంటి సేవలను పొందవచ్చు. వాట్సాప్‌లో ‘ఈ సేవ’లను పొందాలంటే ముందుగా 8096958096 నంబర్‌ను సేవ్‌ చేసుకుని ‘‘ ఏజీ’’అని మెస్సేజ్‌ పంపాలి.

అనంతరం కావలసిన సేవను ఎంచుకుని దరఖాస్తును నింపి ఆన్‌లైన్‌లో చెల్లింపు పూర్తి చేయాలి. చెల్లింపులు పూర్తయ్యాక కొన్ని సేవలకు సంబంధించిన పత్రాలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పొందవచ్చు. ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) మీసేవ కేంద్రంలో అందుబాటులో ఉంటుంది. సర్టిఫైడ్‌ కాపీలు మాత్రం ఆమోదం అనంతరం నేరుగా వాట్సాప్‌లోనే వినియోగదారులకు చేరతాయి. ఇప్పటికే అమలవుతున్న జనన, ఆదాయ ధ్రువపత్రాలు, పోలీస్‌ చలాన్లు, విద్యుత్‌ బిల్లుల వంటి సేవలతో పాటు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల సేవలు కూడా అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవుతోందని చెపుతున్నారు.

ఎక్కడా క్యూలలో బారులు తీరకుండా, కాగితాల అవసరం లేకుండా.. ఎప్పుడైనా, ఎక్కడ నుంచైనా ప్రభుత్వ సేవలను పొందే విధంగా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఆదేశాల మేరకు నవంబర్‌ 18, 2025న ప్రారంభమైన మీసేవ వాట్సాప్‌/చాట్‌బాట్‌ సేవలకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణ వస్తున్నట్లు మీ సేవ కమిషనర్‌ టి. రవికిరణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement