శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ' | Soceye A New Weapon for Safeguarding Peace and Security Telangana | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'

May 18 2026 7:07 PM | Updated on May 18 2026 7:19 PM

Soceye A New Weapon for Safeguarding Peace and Security Telangana

హైదరాబాద్‌: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్(సాక్ ఐ) పేరుతో సరికొత్త కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్‌ను ప్రారంభించింది. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆన్‌లైన్ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని పసిగట్టడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ఈ అత్యాధునిక వ్యవస్థను హైదరాబాద్ పోలీస్ ఐటీ విభాగం రూపొందించింది.

గతంలో సోషల్ మీడియా పర్యవేక్షణకు భారీగా సిబ్బంది అవసరమవ్వడమే కాకుండా గంటల తరబడి మాన్యువల్‌గా శ్రమించాల్సి వచ్చేది. కానీ ఈ 'సాక్ ఐ' ద్వారా ఇకపై అన్నీ ఆటోమేటెడ్‌ పద్ధతిలో నిరంతరాయంగా జరుగుతాయి. దీనిలోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ డ్యాష్‌బోర్డ్ ద్వారా డయల్ 100 కాల్స్, అంతర్గత నిఘా సమాచారం, నగరంలో జరుగుతున్న ప్రధాన ఘటనల వివరాలను ఒకే చోట క్రోడీకరించి అధికారులకు పూర్తి స్థాయి క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తుంది.

సాక్ ఐ తన ప్రయోగాత్మక దశలోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పురానాపూల్ ఎక్స్ రోడ్ ఘటనకు సంబంధించి 85 ద్వేషపూరిత, మతపరమైన సున్నితమైన అంశాలను, అలాగే గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించి పలు సోషల్ మీడియా ఖాతాలలో ఉన్న 126 పోస్ట్‌లను ఇది గుర్తించింది. ఇటువంటి కంటెంట్‌ను సకాలంలో తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా శాంతి సామరస్యాలను కాపాడటమే కాకుండా, విద్వేషాలను రేకెత్తించే వారిని గుర్తించడం సాధ్యమైంది.

ప్రత్యేకించి మాదకద్రవ్యాల సరఫరా, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ వ్యవస్థ దృష్టి పెడుతుంది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్ వంటి అంశాలను ఏఐ మోడల్స్ స్వయంగా గుర్తించి అప్రమత్తం చేస్తాయి. పోస్టుల తీవ్రతను బట్టి వాటిని హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజించి, అభ్యంతరకర పోస్టులను తొలగించేలా సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నివేదిస్తుంది.

నేరగాళ్ల నెట్‌వర్క్ విశ్లేషణ చేసే సామర్థ్యం ఈ అప్లికేషన్ ప్రత్యేకత కావడంతో, వివాదాస్పద పోస్టులను పదేపదే షేర్ చేసే వారిని, వాటిని వైరల్ చేసే ఖాతాలను ఇట్టే పట్టేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.

ప్రతి ఫిర్యాదుకు ఒక యూనిక్ ట్రాకింగ్ నంబర్ కేటాయించి, అది పరిష్కారమయ్యే వరకు ఎండ్-టు-ఎండ్ మానిటరింగ్ చేస్తుంది. నగరంలో ప్రతిరోజూ జరిగే నిరసనలు, ర్యాలీలు, మతపరమైన ఊరేగింపుల వంటి కార్యక్రమాలపై ముందస్తు నిఘా ఉంచేందుకు 'ఈవెంట్ బేస్డ్ మానిటరింగ్' ఫీచర్‌ను ఇందులో పొందుపరిచారు. నిర్ణీత కీవర్డ్స్ ఆధారంగా సోషల్ మీడియా కార్యకలాపాలను ట్రాక్ చేస్తూ, ఏదైనా ముప్పు పొంచి ఉంటే వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది.

అలాగే నేర పరిశోధనలో కీలకంగా మారిన SOCMINT, OSINT వంటి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఇందులో అంతర్భాగంగా ఉండటంతో సైబర్ కేసుల ఛేదన సులభతరం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రొఫైల్స్ మరియు కీవర్డ్స్ ఆధారంగా సెర్చ్ చేసే సామర్థ్యం ఉన్న గ్లోబల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా ఏదైనా అంశంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను, వస్తున్న కథనాలను తక్షణమే విశ్లేషించే వీలు కలుగుతుంది.

అత్యాధునిక ఏఐ సాంకేతికతతో కూడిన ఈ 'సాక్ ఐ' వ్యవస్థ పోలీసుల పనిభారాన్ని తగ్గించడమే కాకుండా, నేర నివారణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని హైదరాబాద్ సీపీ  వీసీ సజ్జనర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. "సమాజంలో అశాంతిని రేకెత్తించే శక్తుల ఆటకట్టించేందుకు, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ ఏఐ వ్యవస్థను రూపొందించాం. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరగాళ్లు సామాజిక మాధ్యమాలను అస్త్రంగా చేసుకుంటున్న తరుణంలో, అత్యాధునిక సాంకేతికతతో వారిని సమర్థంగా ఎదుర్కొంటాం" అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement