సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీకి చుక్కెదురైంది. ‘నవనిర్మాణ సభ’కు అనుమతి నిరాకరించిన పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో ఆ పార్టీకి మంగళవారం ఎదురుదెబ్బ తగిలింది. అత్యవసర విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో నవనిర్మాణ పేరిట సభ నిర్వహణకు జనసేన ప్రయత్నించింది. అయితే తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు, ఇక్కడి రాజకీయ నేతల ఖండన, తాజా రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
నిన్న కోర్టు సాధారణ సమయం ముగిసిన తర్వాత పోలీసుల నుంచి జనసేనకు తిరస్కరణ సమాచారం వెళ్లింది. దీంతో చేసేది లేక ఇవాళ అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి విచారణ జరపాలని కోరింది. అయితే ఈ వ్యవహారంలో ప్రముఖ జర్నలిస్ట్ పాశం యాదగిరి కేవియెట్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టును కోరారు.
ఇరు పక్షాల అంశాలను పరిశీలించిన హైకోర్టు.. జనసేన వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. దీంతో నవనిర్మాణ సభ నిర్వాహణ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఫోకస్ అంతా సాయంత్రం పవన్ కల్యాణ్ నిర్వహించబోయే ప్రెస్‌మీట్ మీద కేంద్రీకృతమైంది.


