నిజామాబాద్ సీపీ సాయి చైతన్య నుంచి రివార్డు అందుకుంటున్న నక్క సుశీల రాణి
నిజామాబాద్ అర్బన్: మావోయిస్ట్ ఛత్తీస్‌గఢ్ డివిజన్ కమిటీ సభ్యురాలు నక్క సుశీలరాణి సీపీ సాయిచైతన్య సమక్షంలో లొంగిపోయారు. సుమారు 34 ఏళ్ల అజ్ఞాత జీవితాన్ని గడిపిన సుశీల స్వస్థలం బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్. ఆమె తండ్రి రామకృష్ణ నిజాంషుగర్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషన్‌గా పని చేశారు. సుశీల చిన్నప్పుడే తల్లి మరణించగా, తండ్రి 2005లో గుండెపోటుతో కన్నుమూశారు.
సీపీఐ(ఎంఎల్) పీడబ్ల్యూ సెంట్రల్ ఆర్గనైజర్ రామ్మోహన్‌రావుతో హైదరాబాద్‌లో సుశీలకు పరిచయమైంది. 1990 జూలైలో వివాహం చేసుకున్న వారిద్దరూ 1992లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2001లో నల్లమల అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో రామ్మోహన్‌రావు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎక్కువ కాలం పని చేసిన సుశీల సైతం పలుమార్లు చావు అంచుల వరకు వెళ్లి బతికిపోయారు. 1998లో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా పావురాలగుట్ట ప్రాంతంలో సుశీలతోపాటు ఉన్న ఏడుగురు సభ్యుల దళం ఆశ్రయం పొందారు. రాత్రి కాపలా విధుల్లో ఉన్న దళ సభ్యుడు సోమ్లానాయక్ నిద్రిస్తున్న సభ్యుల ఆయుధాలు అన్నింటిని సేకరించి సమీపంలో దాచి పెట్టి ఏకే 47 రైఫిల్‌తో కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో సుశీలతోపాటు శాంతక్క అనే మహిళా మావోయిస్టులు గాయపడ్డారు. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో శాంతక్క మరణించగా.. సుశీల ఛాతి, ఎడమ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆమె సమీపంలోని బండరాల మధ్య దాక్కోగా, మరుసటి రోజు సోమ్లా నాయక్ ఆమె వద్దకు వచ్చి ఏడుగురు పోలీసులు సభ్యులపై కాల్పులు జరిపారని నమ్మబలుకుతూనే బండరాయితో ఆమెపై దాడి చేశాడు. రక్తపు మడుగులో పడిపోయిన సుశీలను చూసి చనిపోయిందని భావించిన సోమ్లానాయక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమీపంలోని గ్రామస్తుల సాయంతో సుశీల ప్రాణాలతో బయటపడ్డారు. 2001 మే నల్లమల అటవీ ప్రాంతంలో, 2005 జనవరిలో ఒడిస్సాలోని మల్కాన్‌గిరి జిల్లా పూజారిగూడ, 2008 జనవరిలో ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌లలో సుశీల పాల్గొన్నారు.
చెక్కు అందజేత..
సుశీల లొంగుబాటు సందర్భంగా సీపీ సాయిచైతన్య ఆమెకు సంబంధించిన కేసుల వివరాలను వెల్లడించారు. అనంతరం రూ.5 లక్షల రివార్డు చెక్కును అందజేశారు. తాత్కాలిక ఆర్థిక సహాయం కింద ప్రస్తుతం రూ.25 వేలు అందజేశారు. లొంగిపోయిన మావోయిస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పునరావాస విధానానికి అనుకూలంగా సుశీలకు ప్రయోజనాలు అందుతాయని సీపీ పేర్కొన్నారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దిశా మృతి కేసు దర్యాప్తు.. ఎవరీ సీమా పాహుజా?


