breaking news
Senior Maoist leader
-
మావోయిస్టు నేత మృతి
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మూడు దశాబ్దాలుగా క్రియాశీలకంగా పనిచేస్తున్న సీనియర్ మావోయిస్టు నేత ఒకరు చనిపోయారు. అతడిని మావో డివిజినల్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు. సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో గురువారం రాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇతను మరణించారు. ఈయనపై రూ.8 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామగ్రిని పోలీసులు స్వా«దీనం చేసుకున్నాయి. -
మహారాష్ట్రలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టు సీనియర్ నేత సహా ఇద్దరు నక్సల్స్ చనిపోయారు. ఛత్తీస్‌గఢ్– మహారాష్ట్ర సరిహద్దుల్లోని బోధింటొలా ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ సమయంలో మావోయిస్టులు వారిపైకి కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో కసన్సూర్ దళం డిప్యూటీ కమాండర్ దుర్గేశ్ వట్టి, మరో గుర్తు తెలియని మావోయిస్టు చనిపోయారు. -
‘నా బిడ్డ విడుదలకు సహకరించాలి’
మాజీ మావోయిస్టు తల్లి వేడుకోలు... పలాస : కొన్నేళ్లుగా ఒడిశాలోని భువనేశ్వర్ సెంట్రల్ జైలులో మగ్గిపోతున్న తన కుమారుడు దున్న కేశవరావు విడుదలకు ఆంధ్రా పోలీసులు సహకరించాలని మందస మండలం బొడ్డులూరు గ్రామానికి చెందిన దున్న కాములమ్మ వేడుకొంది. ఈ మేరకు కాశీబుగ్గలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టు జీవితానికి స్వస్తి పలికి జనజీవన స్రవంతిలో కలవడానికి నిర్ణయించుకొని అప్పటి పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఆధ్వర్యంలో అప్పటి డీజీపీ అరవిందరావుతో మాట్లాడి కాశీబుగ్గ పోలీసుల ఎదుట లొంగిపోయారని చెప్పారు. రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని చెప్పి ఎన్నో ఆశలు చూపించి తిరిగి ఒడిశా పోలీసులకు అప్పగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకో తప్పుడు కేసు పెడుతూ జైలులో హింసిస్తున్నారని, నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటే ఆయన ప్రస్తుతం జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిపారు. ఇప్పటికైనా ఆంధ్రా పోలీసులు తన కుమారుడుని తనకు అప్పగించాలని కోరారు. ప్రభుత్వాన్ని నమ్ముకొని నా బిడ్డకు సరెండర్ చేయిస్తే చివరకు నాకు దూరం చేశారని, తన కుమారుడిని చూసేందుకు ఒడిశా వెళ్తూ అనేక ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తన బిడ్డ ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మృతి చెందితే తన కుటుంబం మొత్తం చనిపోవాల్సి ఉంటుందని, అందుకు ప్రజాప్రతినిధులు, ఆంధ్రా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇప్పటికైనా ఆంధ్రా పోలీసులు జోక్యం చేసుకొని తన బిడ్డను ఇంటికి పంపించాలని కోరారు.