సామాజిక ముఖచిత్రం మారుస్తున్న వృత్తిపరమైన వెనుకబాటు | Self-Employment among Scheduled Castes in Telangana | Sakshi
Sakshi News home page

సామాజిక ముఖచిత్రం మారుస్తున్న వృత్తిపరమైన వెనుకబాటు

Apr 17 2026 1:02 AM | Updated on Apr 17 2026 1:02 AM

Self-Employment among Scheduled Castes in Telangana

దినసరి, ఉపాధిహామీ కూలీలుగా 54 శాతం మంది ఎస్సీలు

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు 17 శాతం మంది

రైతులు, వ్యవసాయ కూలీలుగా 42 శాతం మంది ఎస్టీలు

ఎస్టీల్లో 10 శాతం దాటని ప్రభుత్వ ఉద్యోగులు

దినసరి కూలీల్లో 58 శాతం మంది బీసీలు

ఓసీల్లో కూలి పనులకు వెళుతున్నది 8 శాతం మంది

వ్యాపారస్తులుగా కొనసాగుతున్న మరో 39 శాతం మంది

11 శాతం మంది ఎస్టీల ఇళ్లకు విద్యుత్‌ సదుపాయమూ లేదు 

టాయిలెట్స్‌ లేని 33.5 శాతం ఎస్టీ, 18.8 శాతం ఎస్సీ గృహాలు

రాష్ట్రంలో 20 శాతం ఇళ్లకు నేటికీ నల్లానీరు రావడం లేదు

ఎస్‌ఈఈఈపీసీ–2024 నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని అంచనా వేయడానికి వృత్తి అనేది అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి. ఒక సమాజం ప్రధానంగా చేసే పని, వారి ఆర్థిక స్థితిని మాత్రమే కాకుండా, విద్య, నైపుణ్యాభివృద్ధి, మూల ధనం, సామాజిక ఉన్నతికి వారి ప్రాప్యతను కూడా ప్రతిబింబిస్తుంది. శారీరక శ్రమ, రోజువారీ కూలి పని లేదా వ్యవ సాయ పనుల్లో ఎక్కువ మంది ఉండటం అనేది తరచుగా స్థిరమైన ఆదాయం, ఉద్యోగ భద్రత, అధికారిక ఉపాధి అవకాశాల కొరతను సూచిస్తుంది. సామాజిక ముఖచిత్రం మారుస్తున్న వృత్తిపరమైన వెనుకబాటును రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ –రాజకీయ, కుల సర్వే (ఎస్‌ఈఈఈపీసీ– 2024) నివేదిక వెల్లడించింది. సామాజికవర్గాల వారీగా వృత్తిపరమైన వెనుబాటుతనం, జీవన స్థితిగతులను సైతం ఈ నివేదిక స్పష్టం చేసింది.

అందులో పేర్కొన్న కీలక వివరాలు ఇలా..
వృత్తిపరమైన నమూనాలను సమగ్రంగా అంచనా వేయడానికి, రోజువారీ కూలీలు, బాల కార్మికులు, వ్యవసా య, ఉపాధిహామీ కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్‌ ఉద్యోగులు, వ్యాపార యజమానులు, ఇప్పటికీ సాంప్రదా య వృత్తులలో ఉన్నవారి నిష్పత్తి.. ఇవన్నీ కలిసి, ఏ వర్గాలు వృత్తిగతమైన వెనుకబాటులో ఉన్నాయో గుర్తించారు. 

వృత్తిపరంగా వెనుకబాటుకు సంబంధించిన ఐఎస్‌జీ (ఇండెక్స్‌ ఆఫ్‌ సోషల్‌ గ్రూప్స్‌)లో ఎస్టీలు 21 స్థానం, ఎస్సీలు 23 స్థానం, బీసీలు 21 స్థానం, ఓసీలు 7 స్థానంలో ఉన్నారు. 
ఎస్సీల్లోనే వృత్తిపరమైన వెనుకబాటు ఎక్కువ ఉన్నట్టు తేలింది. ఎస్సీల్లో 25 శాతం మంది దినసరి కూలీలుగా, ఉపాధిహామీ పనుల్లో 29 శాతం మంది, రైతులుగా 11 శాతం మంది, వ్యవసాయ కూలీలుగా 27 శాతం మంది, ప్రభుత్వ ఉద్యోగులుగా 17 శాతం మంది, ప్రైవేటు ఉద్యోగాల్లో 14 శాతం మంది, వ్యాపారులుగా 6 శాతం మంది ఉన్నారు. 

ఎస్టీల్లో 13 శాతం మంది దినసరి కూలీలు, ఉపాధి హామీ పనుల్లో కూలీలుగా 12 శాతం మంది, రైతులుగా 23 శాతం మంది, వ్యవసాయ కూలీలు 17 శాతం మంది, ప్రభుత్వ ఉద్యోగులుగా 10 శాతం మంది, ప్రైవేటు ఉద్యోగులుగా 4 శాతం మంది, వ్యాపారులుగా 2 శాతం మంది ఉన్నారు. 
బీసీల్లో 58 శాతం మంది దినసరి కూలీలుగా, ఉపాధి హామీ పనుల్లో 56 శాతం మంది, రైతులుగా 54 శాతం మంది, వ్యవసాయ కూలీలుగా 52 శాతం మంది, ప్రభుత్వ ఉద్యోగాల్లో 54 శాతం మంది, ప్రైవేటు ఉద్యోగాల్లో 53 శాతం మంది, వ్యాపారాల్లో 53 శాతం మంది ఉన్నారు. 

ఓసీల్లో 39 శాతం మంది వ్యాపారులుగా, 29 శాతం మంది ప్రైవేటు ఉద్యోగులుగా, 19 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులుగా, వ్యవసాయ కూలీలుగా 4 శాతం మంది, రైతులుగా 12 శాతం మంది ఉండగా...దినసరి కూలీలుగా 4 శాతం మంది, ఉపాధి పనుల్లో మరో 4 శాతం మంది ఉన్నారు. 
జీవన పరిస్థితులు అనేవి సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని స్పష్టంగా చూపే సూచికల్లో ఒకటి. శుభ్రమైన నీరు, పారిశుధ్యం, విద్యుత్, తగిన గృహ వసతి, పట్టణ సేవలకు సమీపంలో ఉండటం వంటి గౌరవప్రదమైన జీవితానికి అవసరమైన నిత్యావసరాలు కుటుంబాలకు అందుబాటులో ఉన్నాయా లేదా అనే దానిపై ఈ నివేదిక స్పష్టత ఇచ్చింది. 

జనాభాలో 88 శాతం మంది ఎస్టీలు, 70 శాతం మంది ఎస్సీలు, 58 శాతం మంది బీసీలు, 39 శాతం మంది ఓసీలు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 
కనీసం రెండు గదులు లేని ఇళ్లలో నివసిస్తున్న వారిలో బీసీలు 64 శాతం మంది, ఎస్సీలు 73.7 శాతం మంది, ఎస్టీలు 75.5 శాతం మంది, ఓసీలు 47.4 శాతం మంది ఉన్నారు. 

ఇళ్లకు విద్యుత్‌ సదుపాయం లేని వారిలో 11 శాతం మంది ఎస్టీలు, 8.3 శాతం మంది ఎస్సీలు, 4.7 శాతం మంది బీసీలు, 2.7 శాతం మంది ఓసీలు ఉన్నారు. 
ఇళ్లలో టాయిలెట్‌ సదుపాయం లేని వారిలో 32.5 శాతం మంది ఎస్టీలు, 18.8 శాతం మంది ఎస్సీలు, 10.8 శాతం మంది బీసీలు, 4.5 శాతం ఓసీలు ఉన్నారు. 
రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం ఇళ్లకు నేటికీ నల్లా నీటి సదుపాయం లేదు. వివిధ వర్గాల వారీగా చూస్తే నల్లానీరు రాని వారిలో 29.2 శాతం మంది ఎస్టీలు, 19.7 శాతం మంది ఎస్సీలు, 20 శాతం మంది బీసీలు, ఓసీలు 12.8 శాతం మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement