రోజుకు 18, ఏడాదికి 6 వేల రైళ్లు ర‌ద్దు | SCR data: Over 18 trains cancelled everyday | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల‌లో 46 వేల‌ రైళ్లు ర‌ద్దు

May 20 2026 8:09 PM | Updated on May 20 2026 8:24 PM

SCR data: Over 18 trains cancelled everyday

ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే వెల్ల‌డి

హైద‌రాబాద్‌: ఊరేళ్ల‌డానికి ల‌గేజీ స‌ర్దుకుని.. క్యాబో, ఆటోనో ప‌ట్టుకుని హ‌డావుడిగా రైల్వే స్టేష‌న్‌కు వెళ్ల‌గానే ట్రైన్ క్యాన్సిల్ అయింద‌ని తెలిస్తే ఉస్సూరుమంటాం. చేసేదీ లేక ప్ర‌త్యామ్నాయం వెతుక్కుంటాం. ఆర్టీసీ బ‌స్సో, ప్రైవేటు వాహ‌నాల‌ను ఆశ్ర‌యించి ప్ర‌యాణాన్ని పూర్తి చేస్తాం. ర‌ద్దవుతున్న రైళ్ల కారణంగా ప్ర‌తిరోజు దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైళ్లు త‌ర‌చుగా ర‌ద్ద‌వుతున్న ఉదంతాలు ఇటీవ‌ల కాలంలో బాగా పెరిగాయి. ఒక్క ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే జోన్ ప‌రిధిలోలోనే రోజుకు 18 స‌ర్వీసులుపైగా ర‌ద్ద‌వుతున్నాయంటే న‌మ్మ‌గ‌ల‌రా? కానీ ఇది నిజం. ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) స్వ‌యంగా ఈ విష‌యం వెల్ల‌డించింది.

గ‌తేడాది అంటే 2025లో ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే జోన్ ప‌రిధిలో 6 వేల‌కు పైగా రైళ్ల స‌ర్వీసులు ర‌ద్ద‌య్యాయి. ఇందులో 27 స‌ర్వీసులను సిబ్బంది కొర‌త కార‌ణంగా ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది. కోచ్‌ల కొర‌త వ‌ల్ల 297 స‌ర్వీసుల‌ను నిలిపివేశామ‌ని ఎస్‌సీఆర్ వెల్ల‌డించింది. గ‌త నాలుగేళ్ల‌లో 46 వేల‌కు పైగా స‌ర్వీసులు ర‌ద్ద‌య్యాయి. వీటిల్లో ఎక్స్‌ప్రెస్‌, మెయిల్‌, ప్యాసింజ‌ర్‌, ఎంఎంటీఎస్‌ (MMTS), డెమూ స‌ర్వీసులు ఉన్నాయ‌ని తెలిపింది. ఎస్‌సీఆర్ నుంచి ఆర్టీఐ (RTI) ద్వారా 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఈ వివ‌రాలు రాబ‌ట్టింది.

2023, 24 సంవ‌త్స‌రాల‌తో పోలిస్తే 2025లో ప‌రిస్థితి కాస్త మెరుగైంది. ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే జోన్ ప‌రిధిలో 2023లో 17,476, 2024లో16,610 రైళ్ల స‌ర్వీసులు ర‌ద్ద‌య్యాయి. గ‌తేడాది 6,369 రైళ్లు ప‌ట్టాలు ఎక్క‌ల‌కుండానే నిలిచిపోయాయి. బ్లాక్స్ నిర్వహణ, ట్రాక్‌ల మ‌ర‌మ్మ‌తులు, మౌలిక స‌దుపాయాల నిర్మాణ ప‌నుల కార‌ణంగా ఎక్కువ‌గా స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేయాల్సి వ‌స్తోంద‌ని రైల్వే అధికారులు చెబుతున్నారు. కోచ్‌లు, సిబ్బంది కొర‌త వ‌ల్ల కూడా స‌ర్వీసులను నిలిపివేస్తున్నారు.

లోకోపైల‌ట్ల కొర‌త
ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వేలో లోకోపైల‌ట్ల కొర‌త స‌మ‌స్య‌గా మారింది. ఉండాల్సిన దానికంటే 25 శాతం త‌క్కువ‌గా లోకోపైల‌ట్లు ఉన్న‌ట్టు అధికారులు తెలిపారు. మ‌రో 1000 మంది వ‌ర‌కు లోకోపైల‌ట్ల అవ‌స‌రం ఉంద‌న్నారు. సిబ్బంది కొర‌త కార‌ణంగా లోకోపైల‌ట్లపై ప‌నిభారం అధిక‌మ‌వుతోందని, ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి ఖాళీల‌ను భ‌ర్తీ చేయాల‌ని అధికారులు కోరుతున్నారు.

చ‌ద‌వండి: రేయ్‌.. నాశ‌నం అయిపోతారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement