రేయ్‌.. నాశ‌నం అయిపోతారు | son attack parents in Mogalturu video goes viral | Sakshi
Sakshi News home page

వీళ్లు అస‌లు మ‌నుషులేనా?

May 19 2026 7:28 PM | Updated on May 19 2026 7:50 PM

son attack parents in Mogalturu video goes viral

వృద్ధ దంపతులపై దాడికి తెగబడ్డ కుమారుడు, మనవళ్లు

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న దృశ్యాలు

దేవుడా ప్లీజ్ ఇలాంటి వాళ్ల‌ను ఏం చేయాలో నువ్వే చూడు- సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ వీడియోకు నెటిజ‌న్ పెట్టిన కామెంట్ ఇది. వృద్ధులు అని కూడా చూడ‌కుండా ఆస్తి కోసం అమ్మ‌నాన్న‌ల‌పై అమాన‌వీయంగా కొడుకు, అత‌డి పిల్ల‌లు దాడికి తెగ‌బ‌డిన వీడియో చూసినవారంతా ఇలాగే స్పందిస్తున్నారు. అస‌లు వీళ్లు మ‌నుషులేనా, మ‌న‌సంటూ ఉందా అంటూ సోష‌ల్ మీడియాలో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. సొమ్ముల కోసం క‌న్న‌వారిని కింద‌ప‌డేసి క‌ర్కోట‌కంగా కాళ్ల‌తో త‌న్నుతూ దాడి చేస్తున్న దృశ్యాలు స‌మాజంలో దిగ‌జారుతున్న విలువ‌ల‌కు నిలువెత్తు రుజువుగా సాక్షాత్క‌రిస్తున్నాయి.

సమాజంలో బంధాలు, అనుబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా మొగల్తూరు మండలంలోని కొత్తోట గ్రామంలో జరిగిన ఈ ఘోర సంఘటన నిదర్శనం. రెక్కలు ముక్కలు చేసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని కూడా చూడకుండా, కేవలం ఆస్తి కోసం ఓ కొడుకు, అతడి బిడ్డలు (మనవళ్లు, మనవరాలు) కలిసి వృద్ధ దంపతులపై అమానుషంగా దాడికి తెగబడ్డారు. సుమారు రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

కొత్తోట గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సూర్యనారాయణ, కొప్పనాతి కస్తూరిబాయిలకు ముత్యాలరాజు అనే కొడుకు ఉన్నాడు. గత కొంతకాలంగా ఆస్తి విషయమై తల్లిదండ్రులతో అత‌డు గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే ముత్యాలరాజు తన కొడుకులు రాధాకృష్ణ, శేఖర్‌, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధ దంపతులపై కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశాడు. వయసుపైబడిన వారనే కనీస మానవత్వం లేకుండా, ప్రాణాలు తీయాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. వృద్ధులను కిందపడేసి కర్రలతో కొట్టి కాళ్లతో తన్నుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తీవ్ర గాయాలపాలైన సూర్యనారాయణ, కస్తూరి బాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

క‌ఠిన చర్యలు త‌ప్ప‌వు: పోలీసులు
ఈ కేసును తాము ప‌ట్టించుకోవ‌డం లేదంటూ కొన్ని మీడియా ఛానెళ్లలో వ‌చ్చిన వార్త‌ల‌ను మొగల్తూరు పోలీసులు ఖండించారు. ఆ వార్తలు అవాస్తవాలని మొగల్తూరు ఎస్సై జి.వాసు పేర్కొన్నారు. బాధితురాలు కొప్పనాతి కస్తూరి బాయి ఈ నెల 16న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై చట్టప్ర‌కారం క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు.

 చ‌ద‌వండి: ర‌ఘురామ కృష్ణంరాజుకు చెంప‌పెట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement