కొత్త కోర్సుల జోష్‌.. | Rising Demand for Emerging Courses at UG and PG Levels | Sakshi
Sakshi News home page

కొత్త కోర్సుల జోష్‌..

Mar 28 2026 5:02 AM | Updated on Mar 28 2026 5:13 AM

Rising Demand for Emerging Courses at UG and PG Levels

యూజీ, పీజీల్లో ఎమర్జింగ్‌ కోర్సులకు డిమాండ్‌ 

అనుమతుల కోసం పలు కళాశాలల దరఖాస్తు 

బీఎస్సీ ఏఐఎంఎల్, బీఎస్సీ సైబర్‌ సెక్యూరిటీ తదితరాల వైపు మొగ్గు 

హైదరాబాద్, శివారు ప్రాంతాల కాలేజీలే ఎక్కువ

సాక్షి, హైదరాబాద్‌: అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో కొత్త జోష్‌ క న్పిస్తోంది. బీటెక్‌తో సమానంగా తీసుకొస్తున్న ఎమర్జింగ్‌ కోర్సులపై ఆసక్తి పెరుగుతోంది. ఈ మేరకు కొత్త కోర్సులు మొదలు పెట్టేందుకు కాలేజీలు కూడా ముందుకొస్తున్నాయి. 2026–27 విద్యా సంవత్సరంలో వీటిని ప్రవేశ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కాలేజీలు చెబుతున్నాయి. అనుమతి కోరుతూ ఉన్నత విద్యా మండలికి దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటివరకూ యూజీ కాలేజీల నుంచి 200, పీజీ కాలేజీల నుంచి 73 దరఖాస్తులు అందాయి.

అత్యధికంగా బీఎస్సీ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌ (ఏఐఎంఎల్‌), బీఎస్సీ సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల వైపు కాలేజీలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. తర్వాత స్థానంలో బీకాం డిజిటల్‌ మార్కెటింగ్‌ కోర్సుపై ఆసక్తి కనబరుస్తున్నాయి. ఆయా కాలేజీల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల పరిధిలోనివే ఎక్కువగా ఉన్నాయి. 

ఉపాధే లక్ష్యం 
యూజీ, పీజీ తర్వాత తక్షణ ఉపాధిని యువత ఆశిస్తోంది. అయితే సంప్రదాయ డిగ్రీ కోర్సులు ఈ అవకాశం కల్పించలేకపోతున్నాయి. దీంతో ఇంజనీరింగ్‌ విద్య వైపు వెళ్తున్నారు. అక్కడా నైపుణ్యం కొరత అడ్డంకిగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని డిగ్రీ, పీజీ కోర్సుల్లో నైపుణ్యం, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించారు.

ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, డిఫెన్స్‌ సెక్యూరిటీ సర్విసెస్, ల్యాండ్‌ అగ్రికల్చరల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్, ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ అండ్‌ అక్కౌంట్స్, ఏవిమేషన్‌ మేనేజ్‌మెంట్, మెరైన్‌ టెక్నాలజీ, లాజిస్టిక్స్, హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు పలు కోర్సులను డిజైన్‌ చేశారు. బోధన ప్రణాళికను కూడా ఇదే తరహాలో రూపొందించారు. మారుతున్న సాంకేతికత సృష్టిస్తున్న ఉపాధి అవకాశాలకు ఈ కోర్సులు మేలు చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

ఫ్యాకల్టీ మాటేంటి? 
    అనుమతులు మంజూరు చేసే విషయంలో ఆచితూచి అడుగేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 4.6 లక్షల సీట్లున్నాయి. అయితే ఏటా 2.2 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఇందులో కూడా బీకాం, బీఎస్సీ లైఫ్‌సైన్సెస్‌ వంటి కోర్సుల్లోనే అడ్మిషన్లు ఉంటున్నాయి. దీంతో ఈ ఏడాది అకడమిక్‌ ఆడిట్‌ చేపట్టాలని, విద్యార్థులు చేరని కోర్సులు, కాలేజీల్లో సీట్లు తగ్గించాలని మండలి భావించింది.

అయితే అనూహ్యంగా కాలేజీలు కొత్త కోర్సుల వైపు వెళ్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా..ఎమర్జింగ్‌ కోర్సులు బోధించే అధ్యాపకులను ఎక్కడి నుంచి తీసుకుంటారనే దానిపై కాలేజీలు స్పష్టత ఇవ్వడం లేదు. సంప్రదాయ డిగ్రీ కోర్సులు బోధించే వారికి ఇది సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. దీంతో ఐటీ, ఇతర రంగాల్లో నిష్ణాతులైన వారిని ఆన్‌లైన్‌ ద్వారా బోధించే ఏర్పాటు చేయాలని కాలేజీలకు మండలి సూచిస్తోంది.  

అన్నీ పరిశీలించి అనుమతులిస్తాం.. 
ఏఐ సాంకేతికతతో కూడిన కొత్త కోర్సుల ప్రతిపాదనకు మంచి స్పందన వస్తోంది. కాలేజీలు వీటిని ప్రవేశ పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. బోధన సిబ్బంది, ఇతర అంశాలు పరిశీలించిన తర్వాత అనుమతులు ఇస్తాం. – ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యా మండలి చైర్మన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement