‘ధరణి’ తిప్పలు తప్పిస్తున్నాం.. | Revenue Minister Ponguleti at the Praja Darbar | Sakshi
Sakshi News home page

‘ధరణి’ తిప్పలు తప్పిస్తున్నాం..

May 22 2026 3:17 AM | Updated on May 22 2026 3:17 AM

Revenue Minister Ponguleti at the Praja Darbar

నాడు దొరల గడీల్లో.. నేడు పేదల చేతుల్లో పట్టాలు 

ప్రజాదర్బార్‌లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి 

సత్తుపల్లి: గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ధరణి పోర్టల్‌లోని లోపాలతో పేదలు, రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా.. భూభారతి చట్టం ద్వారా ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. నాడు దొరల గడీల్లో బందీ అయిన భూరికార్డులను విడిపించి, భూములపై పేదలకు సర్వాధికారాలు కల్పించడమే ఈ చట్టం లక్ష్యమని తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గురువారం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల ప్రజల నుంచి ఆయన దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రూపాయి లంచం లేకుండా అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే కాక, నిర్మాణంలో దశల వారీగా ప్రతీ సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో మంజూరైన 4.50 లక్షల ఇళ్లలో 1.5 లక్షల ఇళ్లు పూర్తికాగా, జూన్‌ నాటికి మరో లక్ష ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. 

అంతేకాక జూన్‌ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమవుతుందని చెప్పారు. అర్హులైతే చాలు గులాబీ కార్యకర్తలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఇళ్లు రాని పేదలు బాధపడొద్దని.. విడతల వారీగా అందరికీ మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, టీజీఐడీసీ చైర్మన్‌ మువ్వా విజయబాబు, కలెక్టర్‌ దివాకర టి.ఎస్‌. తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement