అందుకే మోదీ బంగారాన్ని కొనొద్దన్నారు: రేవంత్‌ రెడ్డి | Telangana CM Revanth Reddy Criticizes PM Modi Advisories On Gold And Air Travel, Calls Central Policies Ineffective | Sakshi
Sakshi News home page

అందుకే మోదీ బంగారాన్ని కొనొద్దన్నారు: రేవంత్‌ రెడ్డి

May 11 2026 3:33 PM | Updated on May 11 2026 5:37 PM

 Revanth Reddy Slams Modis Foreign Policy Failures
  • పాలనలో ప్రధాని మోదీ వైఫల్యం వల్లే
  • దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు
  • విదేశాంగ విధానంలో విఫలమయ్యారు

హైదరాబాద్‌: బంగారం కొనొద్దని, విమానాల్లో ప్రయాణించొద్దని చెప్పడం ప్రధాని మోదీ వైఫల్యాన‍్ని సూచిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహించిన మోదీ దేశ ప్రజలకు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం రేవంత్‌ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో దీనిపై స్పందించారు.

‘‘విదేశాంగ విధానంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ అసమర్థ విధానాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇది బాధ్యతారాహిత్యమైనది. రాహుల్ గాంధీ మొదటి నుంచి అదే చెబుతున్నారు. ప్రతిపక్షాల సూచనలను తీసుకోవాలి.. అఖిలపక్షాలను పిలిచి మాట్లాడాలి. కేంద్రానికి స్పష్టమైన విధానం లేదు. అనుభవరాహిత్యం, అహంకారం వల్లనే దేశాన్నిసంక్షోభంలోకి నెడుతున్నారు. యూరియాను కేంద్రం ఇవ్వాలి.. రాష్ట్ర ప్రభుత్వం పంచాలి’’ అని విమర్శించారు.

2029లో జమిలి ఎన్నికలు  
కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుందని రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. ‘‘ఎస్ఐఆర్‌ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో 90 లక్షల ఓట్లను తొలగించారు. ఏ రాష్ట్రంలో గెలవాలంటే అక్కడ ఎస్ఐఆర్ ను ప్రయోగిస్తున్నారు.

జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ రాలేదు.. మున్సిపాలిటీల్లో బీజేపీ పరిస్థితి ఏమిటి? జమిలి ఎన్నికలు 2029లో పెట్టడానికి ఆస్కారం ఉంది. బీజేపీకి ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదు. అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానించాలి. గవర్నర్ చెప్పిన తేదీన బలనిరూపణ చేయించుకుంటే సరిపోతుంది.

 బండి సంజయ్ కొడుకు అంశంపైన డీజీపీ, ఇతర అధికారులతో సమీక్ష చేశాను. విచారణ ప్రారంభమైంది.. పోలీసులు చర్యలు తీసుకుంటారు. బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద జరగదు. బాదితులను కలిసి స్టేట్ మెంట్ తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మైనర్ బాలిక కు సంబంధించిన అంశంలో అంతా  భాద్యతాయుతంగా ఉండాలి. తుమ్మడి హట్టి పైన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించేలా చూడాలని ప్రధాని మోదీకి నేను లేఖ రాశాను.

తెలంగాణకు కేంద్రం నుంచి ఆశించిన మేర‌కు స‌హ‌కారం లేదు. రీజ‌న‌ల్ రింగ్ రోడ్డు నార్డ్ ఫార్ట్ , కాకాతీయ మెగా టెక్స్ టైల్స్, ఎయిర్ పోర్టులు క్లియ‌ర్, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ కోసం ఏడీబీ నిధులు, నేష‌న‌ల్ హై వేలు వ‌చ్చాయి. గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఇవి ముందుకు సాగ‌లేదు. మేం వ‌చ్చాక క్లియ‌ర్ చేయిస్తున్నాం. 

మెట్రో, స‌ద‌ర‌న్ పార్టు రీజ‌న‌ల్ రింగ్ రోడ్డు ఇలా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. సింగిల్ విండో విధానం తీసుకువ‌చ్చి ప‌రిష్క‌రించ‌మ‌ని ప్ర‌ధానిని కోరాం. అధికారిక కార్య‌క్ర‌మంలో రాజ‌కీయాలు లేవు. రాజ‌కీయ అంశాల‌కు తావు లేదు. నేను, మోదీ ప్ర‌స్తావించింది అభివృద్ధిని మాత్ర‌మే. అభివృద్ధి విష‌యంలో క‌లిసి ప‌నిచేద్దామ‌ని ఆయ‌న చెప్పారు’’ అని తెలిపారు. తమ ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ప్ర‌స్తావ‌న అభివృద్ధికి చెందిన‌ది మాత్ర‌మేనని.. అందులో రాజ‌కీయాల‌కు తావులేదని చెప‍్పారు.

Advertisement
 
Advertisement
Advertisement