రూ.100 కోట్లతో రీసెర్చ్‌ పార్క్‌ | Research Park at BITS Campus | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్లతో రీసెర్చ్‌ పార్క్‌

Jun 18 2026 3:14 AM | Updated on Jun 18 2026 3:14 AM

Research Park at BITS Campus

బిట్స్‌ క్యాంపస్‌లో 1.20 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు 

వైద్య రంగంలో పరిశోధనలకు అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని నగరంలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) క్యాంపస్‌లో రూ.100 కోట్లతో రీసెర్చ్‌పార్క్‌ ఏర్పాటు కానుంది. ఈమేరకు యాక్సిస్‌ బ్యాంక్, బిట్స్‌ పిలానీ మధ్య ఒప్పందం జరిగింది. యాక్సిస్‌ బ్యాంక్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద గ్రాంట్‌ రూపంలో ఈ నిధులను సమకూర్చనుంది. 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ఇన్నోవేషన్‌ పార్క్‌లో ఆరోగ్యం, మందులు, వైద్య పరికరాల రంగంలో కొత్త ఆవిష్కరణలకు పరిశోధనలు జరుగుతాయి. 

ప్రజలకు తక్కువ ధరకే మంచి వైద్యం అందించడం లక్ష్యంగా సరికొత్త పరిశోధనలకు ఈ కేంద్రం నిలయంగా ఉండనుంది. ఈ పార్క్‌లో పెద్ద ల్యాబ్‌లు, స్టార్టప్‌ కంపెనీల కోసం ప్రత్యేక స్థలాలు ఉంటాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, విద్యార్థులకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ సందర్భంగా బిట్స్‌ పిలానీ చాన్స్‌లర్‌ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ.. బలమైన ఆవిష్కరణ వ్యవస్థలను నిర్మించడానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుందన్నారు. యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈఓ అమితాబ్‌ చౌదరి మాట్లాడుతూ.. సమ్మిళిత, సుస్థిర పురోగతిలో భాగస్వాములం కావడం ఆనందంగా ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement