ఉక్కిరిబిక్కిరవుతోన్న హైదరాబాద్‌!.. ఏడాదికి 98 రోజులు అంతే

Report: Hyderabad Citizens Suffocating With Air Pollution 98 Days a Year - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ సిటీజన్లు ఏడాదికి 98 రోజులపాటు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఊపిరితిత్తులకు పొగబెట్టే సూక్ష్మ ధూళికణాల మోతాదు 2020 కంటే.. 2021 చివరి నాటికి గణనీయంగా పెరిగినట్లు సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఘనపు మీటరు గాలిలో సూక్ష్మ ధూళికణాల మోతాదు (పీఎం– 2.5) సరాసరిన 41 మైక్రోగ్రాములుగా నమోదైనట్లు లెక్కతేల్చింది. కాలుష్యం కారణంగా నగరవాసులు శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టం చేసింది. 2020లో కాలుష్య మోతాదు లాక్‌డౌన్‌ కారణంగా తగ్గుముఖం పట్టినట్లు అంచనా వేయడం విశేషం. 

దక్షిణాదిలో ఇక్కడే అత్యధికం.. 
► దక్షిణాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యంలో గ్రేటర్‌ నగరం మూడోస్థానంలో నిలిచినట్లు ఈ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. రెండోస్థానంలో పొరుగునే ఉన్న ఏపీలోని విశాఖపట్టణం నిలవడం గమనార్హం. 2020లో నగరంలో 60 రోజులు మాత్రమే కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేయగా.. 2021 సంవత్సరంలో గ్రేటర్‌ సిటీలో 98 రోజుల పాటు భరించలేని కాలుష్యంతో సతమతమైందని ఈ నివేదిక తెలిపింది. విశాఖపట్టణం 86 రోజులపాటు కాలుష్యంతో అవస్థలు పడుతోందని నివేదిక వెల్లడించింది.  ప్రధానంగా దక్షిణాదిలో డిసెంబరు– మార్చి మధ్యకాలంలో వాయు కాలుష్యం పెరుగుతోందని పేర్కొంది.  
చదవండి: ముచ్చింతల్‌లో సీఎం కేసీఆర్.. సమతామూర్తి స్పూర్తి కేంద్ర సందర్శన

► శీతాకాలంలో కాలుష్య తీవ్రత అధికంగా ఉంటున్న కారణంగా సిటీజన్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తేల్చింది. ఏడాదిలో గ్రేటర్‌ సిటీలో 98 రోజుల పాటు భరించలేని కాలుష్యం..  మరో 96 రోజులపాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు లోపలే వాయు కాలుష్యం నమోదవుతుండడంతో వాయు నాణ్యత సంతృప్తికరంగానే ఉన్నట్లు వెల్లడించింది. శీతాకాలంలో సూక్ష్మ ధూళికణాల మోతాదు డిసెంబరు 26, జనవరి 3, 2021 తేదీల్లో అత్యధికంగా నమోదైందని తెలిపింది. 

► ఈ రెండు తేదీల్లో ఘనపు మీటరు గాలిలో అత్యధికంగా 81 మైక్రోగ్రాములుగా నమోదవడం గమనార్హం. పారిశ్రామిక అడ్డాగా ఉన్న సనత్‌నగర్‌ ప్రాంతంలో సరాసరిన 83 మైక్రోగ్రాముల మేర సూక్ష్మ ధూళికణాలు నమోదయినట్లు సీఎస్‌ఈ నివేదిక వెల్లడించింది.  గచ్చిబౌలిలోని సెంట్రల్‌ వర్సిటీ వద్ద కూడా సరాసరిన ఘనపు మీటరు గాలిలో 57 మైక్రోగ్రాములుగా ధూళి కాలుష్యం నమోదవడం గమనార్హం.
చదవండి: భద్రతా వలయంలో శ్రీరామనగరం.. అడుగడుగునా పోలీసు నిఘా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top