భద్రతా వలయంలో శ్రీరామనగరం.. అడుగడుగునా పోలీసు నిఘా

Statue of Equality Inauguration: Heavy Security at Muchintal, PM Visit on Feb 5 - Sakshi

ఎస్‌పీజీ.. ఆక్టోపస్‌.. కమాండోలతో పటిష్ట భద్రత

ఈ నెల 5న రానున్న ప్రధాని నరేంద్ర మోదీ 

సాక్షి, శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్న సందర్భంగా ఎస్‌పీజీ అధికారులు బుధవారం ఉదయం విగ్రహ ప్రాంగణంతో పాటు యాగశాలను సందర్శించారు. ఎస్‌పీజీ డీఐజీ నవనీత్‌కుమార్‌ రాష్ట్ర పోలీసులతో కలిసి అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన భద్రత సమీక్షించారు. 

కమాండ్‌ కంట్రోల్‌ రూం 
సమతామూర్తి విగ్రహ ప్రాంగణానికి ముందు పార్కింగ్‌ ఏరియాకు ఎదురుగా ఉన్న భవనంలో  పోలీసుల కమాండ్‌ కంట్రోల్‌ రూంను పూర్తి స్తాయిలో సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి పోలీసుల భద్రత ఏర్పాట్లు, ఇతర సమాచారాలన్నింటికి కూడా కమాండ్‌ కంట్రోల్‌ రూం పనిచేయనుంది. ఎస్‌పీజీతో పాటు ఆక్టోపస్, ప్రత్యేక కమాండోలు భద్రత కోసం రంగంలోకి దిగారు. ఇప్పటికే సమతామూర్తి ప్రాంగణంతో పాటు యాగశాల పరిసరాల్లో వీరు నిరంతరం నిఘా కాస్తున్నారు. 

ఉత్సవాలకు ప్రత్యేక అశ్వాలు 
సమతామూర్తి సహస్రాబ్ధి సమరోత్సాహ వేడుకల్లో పూజా కార్యక్రమాల్లో దేవతా మూర్తుల రథోత్సవం వేళ ముందుగా నడిపించేందుకు ఏపీలోని కడప వ్యాసాశ్రమం నుంచి రెండు శ్వేత రంగు అశ్వాలను తీసుకొచ్చారు. రంగ, గోధ అనే పేర్లుగల ఈ అశ్వాలను ఆశ్రమంలో దేవతామూర్తుల బయటికి తీసుకొచ్చే సమయంలో ముందుగా నడిపిస్తుంటారు. వీటితో పాటు చిన్న జీయర్‌ ఆశ్రమంలో ఉన్న మరో అశ్వం యతి కూడా ఉత్సవాల్లో పాల్గొననుంది. ఈ అశ్వాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.  

సమరోత్సాహ భక్తి ‘స్వీయ చిత్రం’ 
సమతామూర్తి సమారోహ వేదికలో స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడానికి వచ్చిన మహిళలు వీరు.. యాగశాల వద్ద నరసింహస్వామి అవతారంలో ఓ వ్యక్తి తిరుగుతుండడంతో కొందరు వలంటీర్లు ఆయనకు దండం పెడుతుండగా.. మరికొందరు మహిళలు సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యం. (క్లిక్‌: 13 తర్వాతే సందర్శకులకు అనుమతి)

యాగశాలకు చేరుకున్న ఛత్రీలు.. 
యాగశాల వద్దకు  బుధవారం కూడా వరుసగా ప్రత్యేకంగా తయారు చేయించిన ఛత్రీలు చేరుకున్నాయి.. వాటిని తయారు చేసిన కార్మికులు కొందరు యాగశాల వరకు మోసుకుంటూ తీసుకెళ్లారు. (చదవండి: వెయ్యేళ్ల సమతాస్ఫూర్తి.. రామానుజ సమతా కేంద్రం నిర్మాణం..)

టీటీడీ ప్రత్యేక సేవలు 
ముచ్చింతల్‌లో జరుగుతున్న సహస్రాబ్ధి సమారోహ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం తమ వంతు పాత్ర పోషిస్తోంది. ప్రాంగణంలో తిరుమల తిరుపతి ప్రాసస్త్యం, తిరుమల నాడు–నేడు వ్యత్యాసాలు తెలిపే పలు ఛాయా చిత్రాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. చిత్ర ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. విభిన్న రకాల కార్యక్రమాల్లో సహకరించేందుకు తితిదే సిబ్బంది 35 మంది రెండు వారాల పాటు ఇక్కడే ఉండనున్నారు. వీరు కాక దాదాపు 500 మంది వేద పారాయణం చేసేవారు, మ్యూజిక్‌ కాలేజ్‌ నుంచి ఆర్టిస్టులు,  హరికథ కళాకారులు, మంగళవాద్యాలు మోగించే కళాకారులు 15 మంది వచ్చారు. వీరి కార్యకలాపాలను తితిదే తెలంగాణ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పర్యవేక్షిస్తున్నారు.  

ఆకట్టుకున్న శోభాయాత్ర 
సమతా కేంద్రంలో బుధవారం ఉదయం తొలిరోజు నిర్వహించిన శోభాయాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ చంద్ర, జై హనుమాన్‌ నినాదాలతో వేలాది మంది భక్తులు, పండితులు పాల్గొన్న ఈ యాత్ర కనుల పండుగగా సాగింది. ఈ యాత్రకు త్రిదండి చిన జీయర్‌స్వామి సారథ్యం వహించారు. వందలాదిగా రుత్వికులు వేద మంత్రోచ్చారణలు చేస్తూ ఏడుగురు పూజ్య జీయర్లను అనుసరించారు. భక్తుల భజనలకు తోడుగా కోలాట నృత్యాలు ఆహ్లాదపరిచాయి. అనంతరం వాస్తు పూజ, పుణ్యహవచనం జరిగాయి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top