‘టీజీ’ స్మార్ట్‌ కార్డులేవీ ? | Sakshi
Sakshi News home page

‘టీజీ’ స్మార్ట్‌ కార్డులేవీ ?

Published Thu, Mar 21 2024 2:16 AM

RC license chip cards and number plates stopped for weeks - Sakshi

వారంరోజులుగా ఆగిపోయిన ఆర్‌సీ, లైసెన్స్‌ చిప్‌ కార్డులు, నంబర్‌ ప్లేట్స్‌

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కోసమే అంటున్న రవాణాశాఖ సిబ్బంది

ఇన్ని రోజులు సమయం తీసుకోవటంపై అనుమానాలు 

సాక్షి, హైదరాబాద్‌: వాహనాల నంబర్‌ ప్లేట్లపై రాష్ట్ర కోడ్‌ టీఎస్‌ నుంచి టీజీగా మారింది. ఈనెల 15 నుంచి రిజిస్టర్‌ అయ్యే వాహనాలకు టీజీ సీరీస్‌ కేటాయిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ రోజుకు దాదాపు 10 వేల వరకు కొత్త వాహనాలు రాష్ట్రంలో రోడ్డెక్కుతాయి.  ఇప్పటి వరకు ఏ వాహనానికి కూడా టీజీ సీరిస్‌ ఆర్‌సీబుక్‌ గానీ, కొత్త లైసెన్సు స్మార్ట్‌కార్డు గానీ జారీ కాలేదు.

అయితే దీనిపై  రవాణాశాఖ ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవటం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. స్మార్ట్‌ కార్డుల జారీ బాధ్యత ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొని, చిప్‌తో కూడి కార్డు సరఫరా చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో వీటికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి వాటి జారీ ఆగిపోయింది.  

చార్జీల వసూలు సరే...
ఆర్‌సీ, నంబర్‌ ప్లేట్, లైసెన్స్‌ బట్వాడా పేరిట చార్జీలు వసూలు చేస్తున్న రవాణాశాఖ వాటిని  వారంరోజులుగా ఇవ్వకపోవడంపై వాహనదా రులు షోరూమ్‌ నిర్వాహకులనో, రవాణాశాఖ అధికారులనో ప్రశ్నిస్తే.. సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో ఆమేరకు మార్పు చేయాల్సి ఉందని, అందుకే కొంత జాప్యం జరుగుతోందన్నారు. రెండుమూడు రోజుల్లో వాటి బట్వాడా మొదలవుతుందని చెబుతున్నారు. వాహనాల రాష్ట్ర కోడ్‌ మారినందున సాఫ్ట్‌వేర్‌ను కూడా యుద్ధప్రాతిపదికన మార్చాలి.

ఈనెల 15 నుంచి రాష్ట్ర కోడ్‌ మారుతుందని రవాణాశాఖకు స్పష్టమైన అవగాహన ఉంది. వెంటనే సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయొచ్చు. కానీ వారం రోజులు గడుస్తున్నా అప్‌డేట్‌ కాలేదని పేర్కొంటుండటం విచిత్రంగా ఉంది. రాష్ట్ర కోడ్‌ మార్పు అమలులోకి రావటానికి మూడు రోజుల ముందు నుంచే కార్డుల జారీ నిలిచిపోయిందని తెలుస్తోంది. ఇన్ని రోజులుగా సాఫ్ట్‌వేర్‌ను ఎందుకు అప్‌డేట్‌ చేయటం లేదో..ఎందుకు జాప్యం జరుగుతోందో సమాచారం లేదు. దీనిపై ఉన్నతాధికారులు కూడా స్పందించటం లేదు.

ఆర్‌సీ, లైసెన్స్‌ స్మార్ట్‌కార్డులు లేక వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తనిఖీ చేస్తే డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రాలను చూపండి అంటూ రవాణాశాఖ సిబ్బంది సలహా ఇస్తున్నారు. కానీ, రాష్ట్ర సరిహద్దులు దాటే చోట ఉండే చెక్‌పోస్టుల్లో సిబ్బంది ఆ కాగితాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని, చిప్‌ ఉన్న స్మార్ట్‌ కార్డులే చూపాలని పేర్కొంటున్నారని వాహన దారులు చెబుతున్నారు. 

Advertisement
Advertisement