ఐఐటీ హైదరాబాద్‌లో టైహాన్‌ 

Ramesh Pokhriyal Starts TiHAN At IIT Hyderabad - Sakshi

 మానవ రహిత, రిమోట్‌ కంట్రోల్‌ వాహనాలు, డ్రోన్ల సాంకేతికత పరిశీలన–పరీక్షల కోసం ఏర్పాటు 

ఆన్‌లైన్‌ ద్వారా పునాది వేసిన కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ 

‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ దిశగా అతిపెద్ద ప్రాజెక్ట్‌ అని మంత్రి అభివర్ణణ 

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. నగర శివారు లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ–హైదరాబాద్‌)లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అడుగు పడింది. మానవ రహిత విమానాలు, రిమోట్‌ కంట్రోల్‌తో నడిచే వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం పరీక్షించేందుకు ఉద్దేశించిన ‘టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ ఫర్‌ అటానమస్‌ నేవిగేషన్‌ సిస్టమ్స్‌(టైహాన్‌)’ ఏర్పాటుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ మంగళవారం పునాది వేశారు. వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా వేస్తున్న అతిపెద్ద ముందంజగా ఈ ప్రాజెక్టును అభివర్ణించారు. స్వతంత్ర నేవిగేషన్‌ వ్యవస్థకు సంబంధించిన పలు విభాగాలు ఈ ప్రాజెక్టులో కలసికట్టుగా పనిచేస్తాయన్నారు. మానవ రహి త విమానాల నిర్వహణలో ఎదురయ్యే వాస్తవ సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.

మానవ రహిత డ్రోన్లు, వాహనాలను ఎలాంటి అడ్డంకులు, ప్రమాదాలు లేకుండా పరీక్షించేందుకు ఇదో మేలైన వ్యవస్థగా రూపొందుతుం దని ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బీవీఎస్‌ మూర్తి తెలిపారు.  కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం ఐఐటీ–హెచ్‌కు రూ.135 కోట్లు మంజూరు చేశాయి. ప్రాజెక్టులో భాగం గా టైహాన్‌లో టెస్ట్‌ ట్రాక్‌లు, నిత్యజీవితంలో ఎదురయ్యే రకరకాల పరిస్థితులను తలపించేవి ఏర్పాటవుతాయి. అత్యాధునిక సిమ్యులేషన్‌ టెక్నాలజీలు, రహదారి వ్యవస్థలు, వీ2ఎక్స్‌ కమ్యూనికేషన్, డ్రోన్లు ఎగిరేందుకు, దిగేందుకు అవసరమైన రన్‌వేలు, ల్యాండింగ్‌ ఏరియాలు ఏర్పాటుచేస్తా రు. ఇటు సెంట్రలైజ్డ్‌ కంట్రోల్‌ రూమ్‌/గ్రౌండ్‌ కంట్రోల్‌ స్టేషన్, హ్యాంగర్లు కూడా ఈ ప్రాజెక్టులో ఉంటాయని ఐఐటీ–హెచ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top