
నేటి మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా
పథకంపై కేబినెట్‌లో చర్చించాక నిర్ణయం
ఈ నెల 5న సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం
రాజీవ్ యువ వికాసంతో పాటు వివిధ పథకాలపై చర్చించే అవకాశం
నేడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం
మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం(Rajiv Youth Development) మంజూరు పత్రాల జారీ వాయిదా పడింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తొలి రెండు కేటగిరీల వారికి యూనిట్లకు సంబంధించిన మంజూరు పత్రాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే అర్హులందరికీ మంజూరు పత్రాలు ఇచ్చేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.
ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఇందులో రాజీవ్ యువ వికాసంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఇతర కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆదివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటల సాగు సన్నద్ధత, ఉద్యోగుల సమస్యలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, జిల్లాల్లో మంత్రులు చేసిన పరిశీలన, రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
యువ వికాసానికి అనూహ్య స్పందన
రాజీవ్ యువ వికాసం పథకానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో..మొత్తం నాలుగు కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వానికి అందిన ప్రతి దరఖాస్తును పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే అర్హుల ఎంపిక జరపాలని, ఈ పథకం కింద అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో చోటు దక్కకుండా, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని మంత్రులు సూచించారు. క్షేత్రస్థాయిలో కూడా ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తుల విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి అత్యంత పారదర్శకంగా పరిశీలన జరపాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యాకే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయించారు. సోమవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, ఇందుకు జిల్లాల్లో ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని మంత్రులకు సీఎం సూచించారు.
క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి: సీఎం
రాష్ట్రంలో ధాన్యం కొనుకోలుకు సంబంధించిన అంశాలపై మంత్రులు క్షేత్రస్థాయి పరిస్థితులను సీఎంకు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఈ సందర్భంగా మంత్రులు అభినందించారు. కాగా ధాన్యం కొనుగోళ్లపై సీఎం జిల్లాల వారీగా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులతో పాటు ప్రభుత్వం తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడం.. రాష్ట్రానికి ముందస్తు రుతుపవనాలతో కలిగే ప్రయోజనాలు, నష్టాలపైనా చర్చించారు. ఈ సీజన్‌కు సంబంధించి పంటల సాగును వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికార యంత్రాగాన్ని ఈ దిశగా అప్రమత్తం చేయాలని రేవంత్ చెప్పారు.
ఆర్థికేతర అంశాలను పరిష్కరిద్దాం!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ మంత్రివర్గ ఉప సంఘానికి నివేదిక సమరి్పంచింది. ఈ నివేదికలోని ప్రధాన అంశాలను సీఎం రేవంత్‌రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. ఉద్యోగుల సమస్యల్లో ప్రధానంగా ఆర్థికేతర అంశాలను పరిష్కరిస్తే వారికి కొంతమేర ఊరటగా ఉంటుందని, ఉద్యోగ సంఘాల డిమాండ్ కూడా ఇదేనని భట్టి చెప్పారు.
దీంతో ఆర్థికేతర అంశాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, దీనిపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుందామని మంత్రులకు సీఎం సూచించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపైనా, గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు, భూభారతి ద్వారా సమస్యల పరిష్కారం తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. రుతుపవనాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మంత్రులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.