హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు భారీ వర్ష సూచన చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
మరోవైపు, ములుగు జిల్లా, వాజేడు మండలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వాజేడు మండలంలోని పలు కుటుంబాల ఇళ్లలోకి వరదనీరు చేరింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇళ్లలో నిల్వ ఉన్న నీరు బయటకు వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గంగా కాలువలు తవ్వించి నీటి పారుదలకు చర్యలు చేపట్టారు. ఇంటి పరిసరాల్లో నిలిచిపోయిన నీటిని బయటకు పంపించేందుకు అధికారులు, స్థానిక సిబ్బంది కలిసి ప్రయత్నాలు నిర్వహించారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది..
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సామర్థ్యం 20 టీఎంసీ లకు గాను 11.1105 టీఎంసీలు
నీటిమట్టం 148 మీటర్లకు గాను 144.22 మీటర్లు
ప్రాజెక్టు ఇన్ ఫ్లో: 75,328 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 12,875 క్యూసెక్కులు


