‘భారత్‌ జోడో యాత్ర’ 7 ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాల మీదుగా.. 

Rahul Gandhi Bharat Jodo Yatra Telangana Route Map KC Venugopal - Sakshi

15 రోజులు, 375 కి.మీ. మేర జోడో యాత్ర సాగేలా షెడ్యూల్‌ 

కేసీ వేణుగోపాల్‌ సమక్షంలో రూట్‌మ్యాప్‌కు టీపీసీసీ ఆమోదం 

జీహెచ్‌ఎంసీ పరిధిలో 60 కి.మీ. సాగనున్న రాహుల్‌ పాదయాత్ర 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’రాష్ట్రంలో 15 రోజులపాటు 375 కి.మీ. సాగనుంది. ఈ మేరకు రూపొందించిన షెడ్యూల్, రూట్‌మ్యాప్‌లను టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం ఆమోదించింది. గురువారం సాయంత్రం ఇందిరాభవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ముఖ్యఅతిథిగా హాజరవగా ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్‌ అలీతోపాటు ఇతర సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యాత్ర సాగే రూట్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ నెల 23న నారా యణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గంలో కృష్ణా వద్ద కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే యాత్ర 7 పార్లమెంటు నియోజకవర్గాలు, 16 శాసనసభా సెగ్మెంట్ల మీదుగా సాగనుంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల మీదుగా సాగే ఈ పాద యాత్ర హైదరాబాద్‌ పరిధిలో 60 కి.మీ. మేర నిర్వహించేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఈ నెల 31న శంషా బాద్‌ నుంచి ఆరాంఘర్‌ మీదుగా హైదరాబాద్‌లోకి ప్రవేశించే రాహుల్‌ పాదయాత్ర... చార్మినార్‌ నుంచి గాంధీభవన్, నెక్లెస్‌రోడ్డు, బోయినపల్లి వరకు చేరుకోనుంది.

ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని 31న నెక్లెస్‌రోడ్డు వద్ద బహిరంగ సభ జరగనుంది. ఆ రోజు రాత్రి బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడి యాలజీ సెంటర్‌లో రాహుల్‌ రాత్రి బస చేస్తారు. నవంబర్‌ 1న బాలానగర్, కూకట్‌పల్లి, పటాన్‌చెరు మీదుగా ఓఆర్‌ఆర్‌ వద్ద ముత్తంగి నుంచి సంగారెడ్డిలోకి ప్రవేశించే లా మ్యాప్‌ రూపొందించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పాదయాత్రకు అధిక ప్రాధాన్యత ఇస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా, అంతకుముందు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగిన వేణుగోపాల్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు స్వాగతం పలికారు. 

పార్టీ ఐక్యతను చాటండి
రాహుల్‌ చేపట్టిన పాదయాత్రను తెలంగాణలో విజ యవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కోరారు. టీపీసీసీ విస్తృత కార్యవర్గ భేటీ లో ఆయన మాట్లాడు తూ.. తెలంగాణలో కాంగ్రె స్‌ ఐక్యంగా ఉందని ఈ యా త్ర ద్వారా చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 375 కి.మీ.పాటు సాగే పాదయాత్రలో అన్ని వ ర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. యాత్రపై విస్తృతంగా ప్రచారం చేయాలని.. బీజేపీ, సంఘ్‌ పరివార్‌ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.

రాహుల్‌ పాదయాత్ర రూట్‌మ్యాప్‌... 
►ఈ నెల 23న కర్ణాటక–నారాయణపేట జిల్లా సరిహద్దునున్న కృష్ణా నది బ్రిడ్జి నుంచి మక్తల్‌ వరకు.. 
►24, 25 దీపావళి నేపథ్యంలో యాత్రకు విరామం 
►26న మక్తల్‌–దేవరకద్ర 
►27న దేవరకద్ర–మహబూబ్‌నగర్‌ పట్టణం 
►28న మహబూబ్‌నగర్‌–జడ్చర్ల 
►29న జడ్చర్ల–షాద్‌నగర్‌ 
►30న షాద్‌నగర్‌–శంషాబాద్‌ (29 కి.మీ.) 
►31న శంషాబాద్‌ నుంచి ఆరాంఘర్‌–చార్మినార్‌–గాంధీభవన్‌–నెక్లెస్‌రోడ్డు–బోయిన్‌పల్లి 
►నవంబర్‌ 1న బాలానగర్‌–కూకట్‌పల్లి–పటాన్‌చెరు మీదుగా ముత్తంగి 
►నవంబర్‌ 2న పటాన్‌చెరు నుంచి శివంపేట (సంగారెడ్డి) 
►నవంబర్‌ 3 యాత్రకు విరామం 
►నవంబర్‌ 4న సంగారెడ్డి నుంచి జోగిపేట 
►నవంబర్‌ 5న జోగిపేట–శంకరంపేట 
►నవంబర్‌ 6న శంకరంపేట నుంచి మద్నూర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top