సాక్షి, హైదరాబాద్: ఎన్‌కౌంటర్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. కేంద్రం శాంతి చర్చలు జరిపితే ప్రాణ నష్టం ఉండదన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలతో చర్చలు జరిపితే తప్పేంటి? అని ప్రశ్నించారు.
ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టులు నేతలు చనిపోతున్నారు. తాజాగా ఎన్‌కౌంటర్ మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ హరగోపాల్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘మావోయిస్టులు శాంతి చర్యలకు సిద్ధమని ప్రకటించారు కదా. అయినా కేంద్రం డెడ్‌లైన్ పెట్టి మరీ ఎలిమినేట్ చేస్తామంటోంది. ఎన్‌కౌంటర్ల బదులుగా ఏకపక్ష కాల్పులు జరుగుతున్నాయి. కేంద్రం శాంతి చర్చలు జరిపితే ప్రాణ నష్టం ఉండదు. అడవులను కార్పొరేట్ శక్తుల వశం చేసే ప్రయత్నం జరుగుతోంది. సంపదను కార్పొరేట్లకు పంచడమే ఈ అభివృద్ధి నమూనా.
ఎన్‌కౌంటర్ల పేరుతో ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై విశ్వసనీయత తగ్గుతుంది. అదే జరిగితే శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లా తయారవుతాం. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బతికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలతో చర్చలు జరిపితే తప్పేంటి?. ఎన్‌కౌంటర్ల పేరుతో ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. ఆదివాసీల కోసం వచ్చిన చట్టాలనీ ఏమైపోయాయి. ఆయుధాలు పట్టుకోవద్దని చట్టంలో నిబంధన ఉంది. ప్రభుత్వం కూడా చట్టానికి లోబడే ఆయుధం వాడాలి కదా? అని ప్రశ్నించారు.


