ప్రీవెడ్డింగ్‌ షూట్‌.. సినీగీతాలపై వరుడు, వధువు నృత్యాలు 

Pre Wedding Marriage Craze In Adilabad - Sakshi

సాక్షి,  ఎదులాపురం(ఆదిలాబాద్‌): వివాహ వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ సమయంలో మర్చిపోలేని రీతిలో.. మధుర జ్ఞాపకంలా యువతీ యువకులు పెళ్లికి సిద్ధమవుతున్నారు. సినిమాలను తలదన్నేలా ప్రీ వెడ్డింగ్‌ షోలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదట ఖర్చుకు వెనుకాడినా.. క్రేజీ పెరుగుతుండడంతో ఇప్పుడు డబ్బులకూ వెనుకాడకుండా పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు చేసుకుంటున్నారు. సినిమా తరహా మాదిరిగా సినీ, జానపద గీతాలపై కాబోయే జంటలు వీడియో షూట్‌లో చేసి వాటిని పెళ్లి జరిగే రోజు ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శిస్తున్నారు. 

ప్రత్యేకమైన లొకేషన్స్‌.. 
ప్రీవెడ్డింగ్‌ షూట్‌ కోసం ఫొటో, వీడియో గ్రాఫర్లు ప్రత్యేక లొకేషన్లు ఎంపిక చేస్తున్నారు. జిల్లాలో  కొర్టికల్, కుంటాల, పొచ్చెర జలపాతం, సాత్నాల ప్రాజెక్టు, ఖండాల, ఆదిలాబాద్‌ గాంధీ పార్కు, మత్తాడి వాగులు, ఆలయాలు, ప్రకృతివనాల్లో షూటింగ్‌ చేస్తున్నారు. ఒక్కో ఫ్రీ వెడ్డింగ్‌షో చిత్రీకరణకు రెండు నుంచి మూడు రోజుల సమయం తీసుకుంటున్నారు. 

రూ.20 వేల వరకు చార్జి

ఒక్కో ప్రీవెడ్డింగ్‌ షోకు ఫొటో, వీడియో గ్రాఫర్లు రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు చార్జి చేస్తున్నారు. వాహన, డ్రెస్సు, కాస్టూమ్స్, ఇతర ఖర్చులన్నీ వెడ్డింగ్‌ షో చేయించుకునేవారు భరిస్తారు. పెళ్లి ఫొటో, వీడియోలు, ఫ్రీ వెడ్డింగ్‌కు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు తీసుకుంటున్నారు. ఫ్రీ వెడ్డింగ్‌ షో ద్వారా జిల్లాలోని యువత ఫొటోగ్రఫీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. 

మధుర జ్ఞాపకం

ప్రీ వెడ్డింగ్‌ ఒక మంచి అనుభూతి. పెళ్లికి ముందు ఒకరి భావాలు మరొకరికి అంతగా తెలియదు. ప్రీ వెడ్డింగ్‌తో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వేదికగా నిలుస్తోంది. ఒక మధుర జ్ఞాపకం. అంతే కాకుండా ప్రస్తుతం ఒక ట్రెండ్‌గా సాగుతుండడంతో ప్రీ వెడ్డింగ్‌ తీయించుకున్నాం.

– సౌరబ్, శ్రీజ, ఆదిలాబాద్‌

సినిమా  తరహాలో వెడ్డింగ్‌ షో

సినిమా తరహాలో పాటలు చిత్రీకరించేలా వెడ్డింగ్‌ షో చేస్తున్నాం. ఒక పాటకు రూ.20 వేలు తీసుకుంటుంన్నాం. స్వయం ఉపాధి పొందడంతోపాటు నలుగురికి ఉపాధి చూపుతున్నాం. చిత్రీకరించిన పాటను పెళ్లిరోజు ఎల్‌ఈడీ స్క్రీన్‌ ద్వారా ప్రదర్శిస్తున్నాం.

– నవీన్, ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌ 

 చదవండి:  మీసాల వెంట్రుకలతో సూటు.. ఎంత అందంగా ఉందో చూడండి!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top