మే ఆఖరుకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలి | Ponguleti Srinivas Reddy sets May-end deadline for allocating pending 2BHK houses | Sakshi
Sakshi News home page

మే ఆఖరుకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలి

May 1 2026 1:31 AM | Updated on May 1 2026 1:31 AM

Ponguleti Srinivas Reddy sets May-end deadline for allocating pending 2BHK houses

సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర రావు, అడ్లూరి లక్ష్మణ్‌

వెంటనే అనర్హులను తొలగించి.. అర్హులకు కేటాయించాలి

ఆ కాలనీల్లో రూ.400 కోట్లతో మౌలిక వసతుల కల్పన

ఉమ్మడి మెదక్, కరీంనగర్‌ జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రి పొంగులేటి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నా మే నెల చివరికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఇంతవరకు ఖర్చు చేసిన మొత్తాన్ని మినహాయించి, తదుపరి అవసరమైన వ్యయాన్ని రూ.ఐదు లక్షలలోపు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అందచేస్తామని వెల్ల డించారు. అసంపూర్తిగా ఉన్న 2 బీహెచ్‌కే ఇళ్లను పూర్తి చేయడా నికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే నిర్మించుకునేలా నిర్ణయించినట్టు తెలిపారు.

ఈ ఇళ్ల నిర్మాణాలకు గ్రీన్‌చానల్‌లో నిధులు విడుదల చేస్తామని తెలిపారు. గురువారం హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, డి. శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హెచ్‌.వేణుగోపాల్, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌కుమార్, హౌసింగ్‌ కార్యదర్శి వీపీ గౌతం, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్‌ రెవెన్యూ, ఫారెస్టు అధికారులతో ఆయా అంశాలపై సమీక్షించారు.

చాలా ఇళ్లలో అనర్హులు ఉన్నారని, వారిని తొలగించి అర్హులకు ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ వెంటనే అనర్హులను తొలగించే చర్యలు చేపట్టాలని, అర్హులకు కేటాయించాలని, ఇందులో ఎమ్మెల్యేలను భాగస్వాములను చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కాలనీల్లో రూ.400 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. 

భూముల పరిరక్షణలో రాజీపడం
ప్రభుత్వ భూముల ఆక్రమణల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్టు భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారానికి రెవెన్యూ, ఫారెస్టు విభాగాలు జాయింట్‌ సర్వేకు ఆదేశించారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాల యంలో 30 కేవీ ఉత్పాదన సామర్థ్యంతో నెలకొల్పిన సోలార్‌ రూఫ్‌ టాప్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను పొంగులేటి ప్రారంభించారు. 

నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం : మంత్రి శ్రీధర్‌బాబు
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో గృహ నిర్మాణ లక్ష్యాలను చేరుకోలేని అధికారులను ఉపేక్షించేది లేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హెచ్చరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏటా 3,500 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని శ్రీధర్‌బాబు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement