వార్ధా–వెయిన్‌గంగా సంగమం వద్ద లంబాకారంలో బరాజ్
150 మీటర్ల ఎత్తులో 3.482 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం
సర్కారుకు చేరిన ప్రాజెక్టు ప్రీఫీజిబిలిటీ నివేదిక
ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ అభిప్రాయం కోరిన పీఎంఓ
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో కీలక ముందడుగు పడింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద వార్ధా– వెయిన్‌గంగా నదుల సంగమ స్థలంలో 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి ప్రీఫీజిబిలిటీ రిపోర్టు (ప్రాథమిక సాధ్యత నివేదిక) సిద్ధమైంది. ఆర్వీ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ సంస్థ ఈ మేరకు ప్రభుత్వానికి పీఎఫ్‌ఆర్ సమర్పించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బరాజ్ నుంచి 71.5 కి.మీ.ల వరకు ప్రాణహిత కాల్వ తవ్వకాలు జరిపాక, ప్రాజెక్టు పనులను గత ప్రభుత్వం అర్ధంతరంగా నిలుపుదల చేసి దాని స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే.
సగంలో నిలిచిపోయిన కాల్వను సుందిళ్ల బరాజ్‌తో అనుసంధానం చేసి అక్కడి నుంచి నీళ్లను ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎత్తిపోయాలని పీఎఫ్‌ఆర్‌లో ప్రతిపాదించారు. రెండింటి అనుసంధానం కోసం మధ్యలో 20.9 కి.మీ.ల పొడవైన సొరంగంతోపాటు మరో 8.25 కి.మీ.ల గ్రావిటీ కాల్వను తవ్వనున్నారు. తుమ్మిడిహెట్టి బరాజ్ నుంచి 77.086 టీఎంసీలు (దాదాపుగా 80 టీఎంసీలు) తరలించడానికి ప్రతిపాదించగా, ఇందులో 20 టీఎంసీలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టుకు, మిగిలిన 57.086 టీఎంసీలను భవిష్యత్ సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకోనున్నట్టు ప్రతిపాదించారు.
6.517 కి.మీ.ల పొడవైన బరాజ్
బరాజ్ నిర్మాణానికి నాలుగు ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌లను పరిశీలించారు. సాంకేతిక, పర్యావరణ, అంతర్రాష్ట్ర అంశాలను దృష్టిలో ఉంచుకొని మూడో అలైన్‌మెంట్‌కు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇందులో భాగంగా వార్ధా–వెయిన్‌గంగా నదుల అనుసంధాన స్థలం వద్ద లంబాకారంలో 6.517 కి.మీ.ల పొడవైన బరాజ్ నిర్మిస్తారు. దీంతో చాప్రాల వన్యప్రాణి అభయారణ్యం ముంపునకు గురికాదు.
వరదల సమయంలో బరాజ్ నిర్వహణలో సైతం ఇబ్బందులు ఉండవు. వార్ధా నదిపై 60 గేట్లు (పొడవు 867 మీటర్లు), వెయిన్‌గంగా నదిపై 77 గేట్లు (పొడవు 1113.5 మీటర్లు) కలిపి మొత్తం 137 గేట్లతో బరాజ్‌ను నిర్మించనున్నారు. మహారాష్ట్రంలో ముంపును తగ్గించడానికి బరాజ్ ఎత్తును 150 మీటర్లకు పరిమితం చేశారు. ఇరు రాష్ట్రాల్లో ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాదు. మహారాష్ట్రలో 4867, తెలంగాణలో 1309 ఎకరాలు ముంపునకు గురికానున్నాయి.
5.85లక్షల ఎకరాలకు నీళ్లు
ప్రాజెక్ట్ ద్వారా కరువు పీడిత కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 5.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు అందనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 1.65 లక్షల ఎకరాలు, సంగమేశ్వర ఎత్తిపోతల పథకం కింద 70 వేల ఎకరాలు, బసవేశ్వర ఎత్తిపోతల పథకం కింద 1.5 లక్షల ఎకరాలను ప్రతిపాదించారు.
తుమ్మిడిహెట్టిపై పీఎంఓ స్పందన
150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి గత జూన్ 11న సీఎం రేవంత్‌రెడ్డి రాసిన లేఖపై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ఈ లేఖపై అభిప్రాయాన్ని తెలియజేయాలని కేంద్ర జలశక్తి శాఖకు అదే నెల 26న పీఎంఓ లేఖ రాసింది. దీనిపై జలశక్తి శాఖ స్పందన ఏమిటో తెలియాల్సి ఉంది.


